Begin typing your search above and press return to search.

జానా గెలుపుతో.. కాంగ్రెస్ ద‌శ తిరుగుతుందా?

By:  Tupaki Desk   |   15 April 2021 3:30 PM GMT
జానా గెలుపుతో.. కాంగ్రెస్ ద‌శ తిరుగుతుందా?
X
ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ ఎన్నిక‌కు ప్ర‌చార ప‌ర్వం ముగియ‌నుంది. బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌తో ప్ర‌చారానికి తెర‌ప‌డుతుంది. ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ ఎస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ శ‌క్తి వంచ‌న లేకుండా పోరాడుతున్నాయి. ఇక‌, సీఎం కేసీఆర్ సైతం ఇక్క‌డ ప్ర‌చారం చేసి బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి వెళ్లారు. మ‌రోవైపు.. కాంగ్రెస్ అభ్య‌ర్థి, మాజీ మంత్రి జానా రెడ్డి కూడా భారీ ఎత్తున ప్ర‌చారం చేశారు. ఇక‌, తేల్చాల్సింది సాగ‌ర్ ప్ర‌జ‌లే. అయితే.. ఇక్క‌డ కాంగ్రెస్‌కు సంబంధించి ఒక వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది.

సాగ‌ర్‌లో జానారెడ్డి గెలిస్తే.. కాంగ్రెస్ భారీ ఎత్తున పుంజుకుంటుంద‌ని.. ద‌శ తిరిగి.. అధికారంలోకి వ‌చ్చేందు కు అవ‌స‌ర‌మైన శ‌క్తిని కూడ‌గ‌ట్టుకుంటుంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఇది నిజ‌మేనా? ఒక్క జానా రెడ్డి గెలుపుతో.. పార్టీ పుంజుకుంటుందా? అంటే.. కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకం టే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఆధిప‌త్య పోరు ఎక్కువ‌గా ఉంది. ఈ కార‌ణంగానే రాష్ట్ర పార్టీకి అధ్య‌క్ష ప‌దివికి కూడా ఎవ‌రినీ ఎంపిక చేయ‌లేదు. ఎవ‌రిని ఎంపిక చేస్తే ఏమ‌వుతుందోన‌ని భావిస్తున్న పార్టీ అధిష్టానం.. క‌నీసం.. ఆ ఊసు కూడా లేకుండానే సాగ‌ర్ ఎన్నిక‌ల య్యాక చూస్తామ‌ని ప్ర‌క‌టించింది.

మ‌రోవైపు.. పుంజుకుంటున్న బీజేపీ కూడా భారీ ఎత్తున కాంగ్రెస్‌కు స‌వాల్‌గా మారింది. కాంగ్రెస్ ఓటు బ్యాం కును త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. నేత‌ల మ‌ధ్య లోపించిన స‌ఖ్య‌త‌ను స‌రిచేసే ప్ర‌య‌త్నాలు.. అసంతృప్తుల‌ను దారిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. ఉన్న నాయ‌కులు కూడా రేపు సాగ‌ర్‌లో జానా గెలువ‌క‌పోతే.. పార్టీ మారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. గత రెండేళ్ళుగా తెలంగాణలోని కాంగ్రెస్‌ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్న మాట వాస్తవం. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకునే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు.

కానీ కొద్దిరోజులుగా పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్‌ నెలకొంది. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాకూర్‌ నడుం బిగించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణను అమలు చేస్తుండటం మంచిదే అయినా.. ఆ దిశ‌గా సీనియ‌ర్ నేత‌లు క‌లిసి రావ‌డం అనేది ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి చేపట్టిన పాద యాత్ర కొంత మేర‌కు జోష్ నింపినా.. వ్య‌క్తి ఎదుగుద‌ల‌ను స‌హించ‌లేని కొంద‌రు సీనియ‌ర్లు.. ఈయ‌న‌ను డైల్యూట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జానా గెలిచినా.. కాంగ్రెస్ పుంజుకుంటుంద‌నే ఆశ‌లు అంతంత మాత్ర‌మేన‌ని.. జ‌ర‌గాల్సిన ఆప‌రేష‌న్లు చాలానే ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.