Begin typing your search above and press return to search.

సౌదీలో మ‌నోళ్ల `ప‌ని` ఔటేనా?

By:  Tupaki Desk   |   24 Aug 2017 1:05 PM GMT
సౌదీలో మ‌నోళ్ల `ప‌ని` ఔటేనా?
X
అవును. ఇప్పుడు సౌదీలోని భార‌తీయ‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం అమెరికాకే ప‌రిమిత‌మైన స్థానిక వాదం - మా ఉద్యోగాలు - మా అవ‌కాశాలు మాకే- అనే నినాదం ఇప్పుడు సౌదీ వ‌ర‌కు పాకింద‌ని అంటున్నారు. నిజానికి సౌదీలో భార‌త్ స‌హా అనేక దేశాల‌కు చెందిన పౌరులు వివిధ వృత్తుల్లో ఉపాధి పొందుతున్నారు. ఇక్క‌డ క‌రెన్సీకి ఎక్కువ విలువ ఉండ‌డంతో ఈ దేశాల్లో ఉపాధి పొందితే.. స్వ‌దేశంలోని త‌మ వారు సంతోషంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా జీవితం గ‌డుపుతార‌ని ఆశించి ఎన్నో వ్యయ ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని సౌదీ బాట ప‌డుతున్నారు. అక్క‌డ షేక్ ల నుంచి ఏజెంట్ల నుంచి ఎన్నో స‌మ‌స్య‌లు ఎదురైనా ఓర్చుకుని ప‌నిచేస్తున్నారు.

అయితే, సౌదీ రాజు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం.. ఇక‌పై ఇలాంటి వారికి ఎంట్రీ లేకుండా చేస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశంలో పాటించే నితాఖత్‌(సౌదీసేషన్‌) విధానంలో సవరణలు చేపట్టింది. విదేశీయుల కంటే సౌదీలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేలా ఈ సవరణలు చేసింది. సెప్టెంబర్‌ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లే భారతీయులకు ఉద్యోగాలు దొరకడం కష్టతరం కానుంది. విదేశాల నుంచి వలసలు పెరిగిపోతుండటంతో స్వదేశీయులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు సౌదీ అరేబియా 2011లో నితాఖత్‌ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ప్రయివేటు సెక్టార్లలో విదేశీ ఉద్యోగులకు బదులుగా సౌదీ జాతీయులకు ఉద్యోగావకాశాలు పెంపొందించడం.

ఈ విధానం కింద దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలను నాలుగు కేటగిరీలుగా చేసింది. అంతేకాదు, ఈ విధానాన్ని పాటించ‌ని సంస్థ‌ల లైసెన్సుల‌ను సైతం కేన్సిల్ చేసేందుకు క‌ఠినంగా శిక్షించేందుకు కూడా సౌదీ వెనుకాడ‌డం లేదు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు - చేసే వ్యాపారం - వచ్చే ఆదాయాన్ని - ఉద్యోగుల సగటు జీతం బట్టి ప్లాటినం - గ్రీన్‌ - ఎల్లో - రెడ్‌ సంస్థలుగా విభజించింది. వీటిని బట్టి సంస్థల్లో సౌదీ - విదేశీ ఉద్యోగుల నిష్పత్తిని ప్రభుత్వం తయారుచేస్తుంది. ఉదాహరణకు ప్లాటినం సంస్థల్లో 40శాతం కంటే ఎక్కువగా సౌదీ జాతీయులే ఉద్యోగులుగా ఉండాలి. ఇప్పటివరకూ 10 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రయివేటు సంస్థలకు నితాఖత్‌ విధానాన్ని అమలు చేసేవారు.

తాజాగా చేపట్టిన సవరణలో ఈ సంఖ్యను 6 లేదా అంతకంటే ఎక్కువకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక.. ప్లాటినం, హైగ్రీన్‌ సంస్థలు మాత్రమే బ్లాక్‌ వీసాల జారీకి అర్హులని నిర్ధారించింది. ప్లాటినమ్‌, హైగ్రీన్‌ కేటగిరీల్లో ఉండే సంస్థలు తక్కువగా ఉండటంతో భారత్‌ నుంచి వెళ్లే వారికి ఉద్యోగావకాశాలు తగ్గిపోనున్నాయి. ఇలా... మొత్తానికి అమెరికా మాదిరిగా సౌదీ కూడా మా ఉద్యోగాలు, మా అవ‌కాశాలు అనే నినాదం ఎత్తుకోవ‌డంతో ఇప్పుడు భార‌త దేశ‌ వ్యాప్తంగా కూలీలు, ఇత‌ర చేతి వృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.