Begin typing your search above and press return to search.

ఆ అద్భుత గోల్ తో.. బ్రెజిల్ కు కొత్త హీరో

By:  Tupaki Desk   |   26 Nov 2022 10:59 AM GMT
ఆ అద్భుత గోల్ తో.. బ్రెజిల్ కు కొత్త హీరో
X
క్రికెట్ లో ఆస్ట్రేలియా ఎలాగో.. ఫుట్ బాల్ లో బ్రెజిల్ అలా. ఐదుసార్లు ప్రపంచ కప్ విజేత బ్రెజిల్. ఫుట్ బాల్ అంటే ఆ దేశ ప్రజలు ప్రాణం ఇస్తారు. అందుకే అక్కడినుంచి ఒక పీలే.. ఒక రొమారియో.. ఒక బెబెటో.. ఒక రొనాల్డో.. ఒక నెయ్ మార్ వంటి అద్భుత ఆటగాళ్లు పుట్టుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే బ్రెజిల్ ను ప్రపంచ ఫుట్ బాల్ రాజధాని అనవచ్చు. అలాంటి బ్రెజిల్ ప్రస్తుత కప్ లో ఆరోసారి టైటిల్ కొట్టేందుకు తీవ్ర కసి మీద ఉంది.

20 ఏళ్ల కల.. సూపర్ స్టార్ కు గాయం బ్రెజిల్ ఫుట్ బాల్ ప్రపంచ కప్ గెలిచి చూస్తుండగానే 20 ఏళ్లయిపోయింది. ఎంత గొప్ప జట్టయినా.. రెండు దశాబ్దాలు ప్రపంచ టైటిల్ కొట్టకుండా ఉండడం అంటే పెద్ద లోటే. కాగా, ఆ లోటును ఈసారి తీర్చుకోవాలని సాంబా జట్టు పట్టుదలతో ఉంది. మరోవైపు సూపర్ స్టార్ నెయ్ మార్ మంచి ఫామ్ లో ఉండడంతో బ్రెజిల్ కు టోర్నీలో అంతా నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ, తొలి మ్యాచ్‌లోనే చీలమండకు దెబ్బ తగిలి ఎక్కువసేపు మ్యాచ్‌లో కొనసాగలేక పోయాడు. మైదానాన్ని వీడిన నెయ్‌మార్‌ గ్రూప్‌ దశలో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

బ్రెజిల్.. సొంత గడ్డపైనా దక్కలేదు 2014 ప్రపంచ కప్ నకు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. దీంతోపాటు హాట్ ఫేవరెట్ గానూ బరిలో దిగింది. అలాఅలా సెమీస్ వరకు వచ్చింది. కానీ, క్వార్టర్స్‌లో నెయ్‌మార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్ట్రెచర్‌ మీద బయటికి వెళ్లాల్సి వచ్చిందంటే తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అనంతరం సెమీస్‌లో బ్రెజిల్‌కు ఘోర పరాభవం ఎదురైంది. అప్పుడు
జర్మనీ ఊచకోతకు దిగి 7-1తో బ్రెజిల్ ను మట్టికరిపించింది. ఆపై ఫైనల్లో 1-0తో అర్జెంటీనాను ఓడించింది. అలా స్వదేశంలో నిర్వహించిన కప్ లో బ్రెజిల్ పరాభవంతో ఇంటి దారిపట్టింది.

మళ్లీ నెయ్ మార్ కు గాయం.. కానీ ఇప్పుడో హీరో ప్రస్తుత ప్రపంచ కప్ లో బ్రెజిల్ తొలి మ్యాచ్ ను శుక్రవారం సెర్బియాతో ఆడింది. మంచి దూకుడే కనబర్చినప్పటికీ నెయ్ మార్ గాయం మాజీ చాంపియన్ ను కలవర పరుస్తోంది. కానీ, ఆ బెంగే వద్దంటూ దూసుకొచ్చాడో రిచర్లిసన్. కొంత వింతగా ఉన్న అతడి పేరే కాదు.. అతడి నేపథ్యమూ అంతే. సెర్బియాతో మ్యాచ్‌లో అసాధారణ కిక్‌తో మెరుపు గోల్‌ చేసిన ఇతడు పేదరికంలో పుట్టి పెరిగాడు. బ్రెజిల్‌లోని నోవా వెనిసియా అనే మురికివాడకు చెందిన రిచర్లిసన్.. పెద్దవాడయ్యే కొద్దీ ఎన్నో కష్టాలను చూశాడు. రిచర్లి తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. తల్లి చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే, రిచర్లిసన్‌ చుట్టూ వాతావరణం మాత్రం ప్రమాదకరంగా ఉండేది. స్నేహితుల్లో ఎక్కువమంది స్మగ్లర్లే. రిచర్లీ తల్లికి పనిలో చేదోడుగా ఐస్‌ క్రీములు, చాక్లెట్లు అమ్మేవాడు. కార్లు కడిగేవాడు.

ఒకసారి డ్రగ్స్‌ ఎత్తుకెళ్లేవాడని భావించి ఓ స్మగ్లర్‌ రిచర్లిసన్‌ కణతకు తుపాకీ గురిపెట్టాడు. ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లే అనిపించినా కొద్దిలో తప్పించుకున్నాడు. కొడుకు డ్రగ్స్‌ వలలో చిక్కుకోకూడదని రిచర్లిసన్‌ తండ్రి అతడిని ఫుట్‌బాల్‌వైపు నడిపించాడు. అదే అతడి జీవితాన్ని మార్చింది. వీధుల్లో ఫుట్‌బాల్‌ ఆడే అతడిని చూసి ఓ వ్యాపారవేత్త మెనిరో క్లబ్‌లో చేర్పించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన అతడిని 60 మిలియన్‌ పౌండ్లు వెచ్చించి టొటొన్‌హమ్‌ దక్కించుంది. ఈ స్ట్రైకర్‌.. బ్రెజిల్‌ తరఫున ఇప్పటిదాకా 39 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 19 గోల్స్‌ కొట్టాడు.

2 గోల్స్ అతడివే.. రెండోది బైసికిల్ కిక్ అత్యద్భుతం సెర్బియాపై బ్రెజిల్ 2-0తో గెలవగా.. ఆ రెండు గోల్స్ చేసినదీ రిచర్లీనే. కేవలం 9 నిమిషాల వ్యవధిలో వీటిని కొట్టాడు. అయితే.. రెండో గోల్ వీటిలో మరింత ప్రత్యేకం. గాల్లోకి ఎగురుతూ బైసికిల్ కిక్ తరహాలో అతడు కొట్టిన గోల్ అత్యద్భుత.కాళ్లు ముందు నుంచి పైకి లేపి, పూర్తిగా రివర్స్‌ తిరుగుతూ బంతిని కాలితో తన్నిన రిచర్లి తన జట్టుకు
రెండో గోల్ అందించాడు. విన్సియస్‌ జూనియర్‌ నుంచి పాస్‌ను అందుకుని పైకి లేపిన రిచర్లిసన్‌.. ఎడమవైపు పల్టీ కొడుతూ సెర్బియా డిఫెండర్‌ను తప్పించి బంతిని గోల్‌ పోస్ట్
లోకి పంపాడు. కాగా రిచర్లి తొలి గోల్‌కు కూడా విన్సియసే పాస్ ఇచ్చాడు.

కల తీర్చేది ఇతడే బ్రెజిల్ 20 ఏళ్ల కప్ కలను నెయ్ మార్ రెండు సార్లు తీర్చలేకపోయాడు. ఓసారి గాయంతో నిరాశపర్చగా.. మరోసారి విఫలమై ఉసూరనిపించాడు. గాయపడి గ్రూప్ దశ వరకు
జట్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో మూడోసారి అతడి ప్రయత్నంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కప్ గెలవాలంటే రిచర్లీనే కీలకం.
అతడి ఫామ్ చూస్తే భరోసాగానూ కనిపిస్తున్నది. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.