Begin typing your search above and press return to search.

ఈ పరిస్థితి తో భారత్ ‌ను అతిపెద్ద ఎకానమీగా మార్చలేరట..ఎవరన్నారంటే?

By:  Tupaki Desk   |   23 July 2020 12:00 PM IST
ఈ పరిస్థితి తో భారత్ ‌ను అతిపెద్ద ఎకానమీగా మార్చలేరట..ఎవరన్నారంటే?
X
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్ ను అరికట్టడానికి మరోదారి లేక చాలా దేశాలు లాక్ డౌన్ ను అమలు చేశాయి. లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపించింది. దేశ ఆర్థిక పరిస్థితిని మళ్లీ గాడిలో పెట్టడానికి చాలా దేశాలు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ లు ప్రకటించాయి. ఇప్పటికే మనదేశంలో కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ మాట్లాడుతూ .. కరోనా మహమ్మారికి సంబంధించిన వ్యాక్సీన్ వచ్చాక మరిన్ని ఆర్థిక ఉద్దీపనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.

అయితే , ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో పాటు వాటిని ఏ సమయంలో ప్రకటించాలనేది కూడా చాలా ముఖ్యమని, కరోనా పరిణామాలపై అనిశ్చితి తొలిగే సమయం కోసం మనం వేచి చూడాలని, ఆ తర్వాత చర్యలు చేపడితే మంచి ఫలితం ఉంటుందని, కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి రావడానికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చునని, మరో రెండు మూడు నెలల్లో వ్యాక్సీన్ వస్తుందనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే అని సుబ్రమణియన్ తెలిపారు. భారత బ్యాంకింగ్ సెక్టార్ ఇబ్బందులు పెట్టుబడులు, వృద్ధిని ప్రభావితం చేశాయని తెలిపారు. ఆయన ఫిక్కీ 17వ యాన్యువల్ కేపిటల్ మార్కెట్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.

పెద్ద బ్యాంకులపరంగా భారత్ చాలా వెనుకబడి ఉందన్నారు. టాప్ 100లో చైనా బ్యాంకులు 18 ఉంటే, మన బ్యాంకు ఒకటి మాత్రమే ఉందన్నారు. అమెరికా నుండి 12 బ్యాంకులు ఉండగా, మనకంటే చాలా చిన్నవైన స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్ దేశాలు మంచి స్థితిలో ఉన్నాయన్నారు. అలాగే , పెద్దమొత్తంలో రుణాలు తీసుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రుణాలు ఇచ్చేముందు బ్యాంకులు తొలుత వారి ఫైనాన్షియల్ స్టేటస్‌ ను చూడాలని తెలిపారు. బ్యాంకింగ్ రంగ ప్రస్తుత పరిస్థితితో భారత్‌ ను అతిపెద్ద ఎకానమీగా మార్చలేమని అయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుత మందగమనంలో ఎక్కువ పాత్ర బ్యాంకింగ్ రంగంలోని సమస్యల వల్లేనని అభిప్రాయపడ్డారు.