Begin typing your search above and press return to search.

మోడీ అనుమతి లేకుంటే.. మంచి పనిని ఆపేస్తారా?

By:  Tupaki Desk   |   6 Jun 2021 10:30 AM GMT
మోడీ అనుమతి లేకుంటే.. మంచి పనిని ఆపేస్తారా?
X
పవర్ చేతిలో ఉన్నప్పుడు తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని.. లేకుంటే ఊరుకునేదే లేదన్నట్లుగా వ్యవహరించటం అందరూ చేసేదే. కానీ.. సమయానికి తగ్గట్లు వ్యవహరిస్తూ.. కొన్నిసార్లు తగ్గుతూ.. కొన్నిసార్లు తమ మాటను నెగ్గించుకోవటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం బాగుంటుంది. తాము అనుకున్నదే జరగాలన్న మొండితనం అన్ని సందర్భాల్లో అచ్చిరాదు. అధికారంలో ఉన్న వారు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోడీ ఈ మధ్యన మిస్ అవుతున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇలాంటి అనుమానాన్ని కలిగించేలా చేస్తోంది. తాము అధికారంలో లేని రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు ‘సహాయ నిరాకరణ’ చేస్తుందన్న ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. ఏడాది క్రితం వరకు ఇలాంటివి ఎన్ని వచ్చినా తట్టుకునే శక్తి మోడీ సర్కారుకు ఉండేది. ఇప్పుడు అలా కాదన్నది మర్చిపోకూడదు. కొవిడ్ సెకండ్ వేవ్ వేళ మోడీ సర్కారుపై వస్తున్న విమర్శలు.. వ్యాక్సినేషన్ విషయంలో జరిగిన డ్యామేజ్ నేపథ్యంలో కేంద్రం తన దూకుడును తగ్గించాల్సిన అవసరం ఉంది.

కానీ.. తమకు అలాంటివేమీ పట్టవన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారుతో పెట్టుకున్న లొల్లి ఇప్పుడు మోడీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రతి వ్యక్తికి ఇంటి వద్దకే నిత్యవసరాలు అందించాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలి. ఈ పథకంతో 72 లక్షల మంది లబ్థి పొందనున్నారు.

అయితే.. ఈ పథకాన్ని తమకు చెప్పకుండా.. తమ ఆమోదం తీసుకోకుండా అమలు చేయకూడదని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పస్టం చేస్తున్నారు. దీంతో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విటర్ లో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శల్ని గుప్పించింది. అయినా.. మంచి పని చేసే వేళలోనూ కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరా? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. టైం బాగోలేనప్పడు కాస్త తగ్గితే ఏమవుతుంది మోడీ సాబ్?