Begin typing your search above and press return to search.

లోకేష్ స్టార్ట్ చేయకుండానే తుస్సునా...?

By:  Tupaki Desk   |   17 Nov 2022 12:30 PM GMT
లోకేష్ స్టార్ట్ చేయకుండానే తుస్సునా...?
X
తెలుగునాట పాడయాత్రలకు ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. పాదయాత్ర చేసిన వారు అంతా సీఎం లు అవుతారు అన్నది ఒక సెంటిమెంట్ గా మారింది. అది జరిగింది కూడా. పాదయాత్ర అన్నది 2003లో వైఎస్సార్ తో మొదలెడితే ఆ తరువాత చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా పాదయాత్రలు చేసి సీఎం కుర్చీ ఎక్కిన వారే. ఒక విధంగా పాదయాత్ర అన్నది అధికారానికి దగ్గర దారి అని చెబుతారు. ఇపుడు దేశంలో కూడా రాహుల్ గాంధీ భారీ ఎత్తున పాదయాత్ర చేస్తున్నారు.

అలాగే తెలంగాణా రాజకీయాల్లో కూడా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అలాగే వైఎస్ షర్మిల సైతం పాదయాత్రతో హడావుడి చేస్తున్నారు. ఏపీలో చూసుకుంటే 2024 ఎన్నికలకు పాదయాత్రతో కొత్త ట్విస్ట్ ఇవ్వాలని టీడీపీ అనుకుంటోంది. చాలా కాలంగా ఆ పార్టీలో ఒక చర్చ అయితే దాని మీద సాగింది. పాదయాత్ర అంటే అది చంద్రబాబు చేస్తారా లేక లోకేష్ చేస్తారా అన్న చర్చల నుంచి చివరికి లోకేష్ అని ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు డేట్ కూడా సెట్ చేసి పెట్టుకున్నారు.

కొత్త ఏడాది అంటే 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు అని భారీ ప్రకటన వచ్చినా అనుకున్న స్థాయిలో అయితే ఏపీ రాజకీయాల్లో హైప్ క్రియేట్ కావడంలేదు. లోకేష్ పాదయాత్ర అంటే పార్టీ క్యాడరే పెద్దగా రెస్పాండ్ అవడం లేదు అని అంటున్నారు. టీడీపీ భావి వారసుడిగా లోకేష్ ఉన్నారు. ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీలో ఆయనే చంద్రబాబు తరువాత సీటులో ఉండేది.

అలాంటి లోకేష్ పాదయాత్ర అంటే ఈపాటికి పసుపు పార్టీలో పరవశం కాస్తా అంబరం తాకలి. కానీ అలాంటిది ఏమీ లేకుండా చాలా చప్పగా పరిస్థితి ఉంది. చంద్రబాబు పాదయాత్ర అంటే 2012 టైం లో తమ్ముళ్ళల్లో ఏకంగా పూనకాలు వచ్చాయి. వారంతా చాలా రోజుల ముంచే ఎవరికి వారు రెడీ అయి తామూ బాబుతో పాటే అని ముందుకు ఉరికారు. ఏ వూరు చంద్రబాబు వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వచ్చేవారు.

ఇక చంద్రబాబు మంచి వక్త కాకున్నా సందర్భోచితంగా బాగా మాట్లాడతారు. పరిస్థితికి తగినట్లుగా ఆయన ప్రకటనలు ఉంటాయి. దాంతో చంద్రబాబు పాదయాత్ర సూపర్ హిట్ అయి ఆయన్ని అందలం ఎక్కించింది. జగన్ తీరు చూసినా ఆయన మంచి ఉపన్యాసకుడు కాదు, కానీ జనాలకు ఏమి కావాలో ఆ మేరకు మాట్లాడుతూ ఆయన మాస్ ని బాగా మెప్పించారు. అలాగే ఆయన అనేక మందిని కూడా పాదయాత్రలో కలుసుకుని తానేంటో జనం ముంచు ఆవిష్కరించుకున్నారు.

ఇపుడు చినబాబు పాదయాత్ర అంటే కచ్చితంగా చంద్రబాబుతో ముందు పోలుస్తారు. తండ్రి ఎలా మాట్లాడేవారు, ఎలా వ్యవహరించేవారు అన్న పోలికతోనే సగం ఇబ్బంది వస్తుంది. ఇక ప్రత్యర్ధిగా ఉన్న జగన్ తోనూ పోలిక కచ్చితంగా వస్తుంది. జగన్ లోని అగ్రెస్సివ్ నెస్. ఆయనలోని దైనమిక్ నేచర్ తో కూడా లోకేష్ ని చూస్తారు.

ఇలా లోకేష్ పాదయాత్ర అంటే ఇవన్నీ కళ్ళ ముందు ఉంటాయి. వీటికి మించి తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నది ఆయన వాచకం చూసి అని అంటున్నారు. లోకేష్ సైతం మంచి వక్త కాదు అన్న మాట పక్కన పెడితే ఏమి మాట్లాడుతారో ఒక్కోసారి ఎవరికీ తెలియదు అని అంటారు. ఆయన ఒక మాట చెప్పబోయి మరో మాట చెబితే అది వివాదంగా మారుతుంది. రాజకీయాల్లో ప్రతీ అక్షరం చాలా విలువ అయినది.

ప్రత్యేకించి సోషల్ మీడియా యుగంలో ఆచీ తూచీ మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. పైగా ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. ఈ విషయంలో లోకేష్ ని ఎలా కార్నర్ చేయాలో అలా చేసి పారేస్తుంది అని తమ్ముళ్ళు భయపడుతున్నారుట. ఒకవేళ ఇలాంటి పొరపాట్లు జరిగితే మాత్రం పాదయాత్ర వల్ల వచ్చే పాజిటివిటీ పొలిటికల్ మైలేజ్ మాట దేముడెరుగు ఫుల్ గా డ్యామేజి అవుతుంది అని కూడా కంగారు పడుతున్నారు.

మరి పాదయాత్ర సందర్భంగా చాలా మంది ప్రజలను కలవాలి. వారితో ముచ్చట్లు పెట్టాలి. వారితో ఎలా మసుకుంటున్నారు అన్నది కూడా మీడియా నిఘా పెట్టి మరీ చూస్తుంది. దాన్ని బయటకు తెలియచేస్తుంది. మొత్తానికి నాలుగు వేల కిలోమీటర్లు పదిహేను నెలలు మహా పాదయాత్రకు లోకేష్ రెడీ అవుతున్నారు.

ఇది ఆయనకు మహా యజ్ఞం అవునో కాదో తెలియదు కానీ తమకు మాత్రం మహా బరువు బాధ్యతగానే తమ్ముళ్ళు ఫీల్ అవుతున్నారు. అందువల్లనే లోకేష్ పాదయాత్ర అనౌన్స్ మెంట్ కి ఎక్కడా కిక్ రావడం లేదు అంటున్నారు. మరి ఆరంభంలోనే ఇలా తుస్సు అయితే సొంత పార్టీ నుంచే రెస్పాన్స్ రాకపోతే ఇక లోకేష్ అడుగులు ఎలా పడతాయి అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.