Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షి గంగాధరరెడ్డి అలా చనిపోయారంటున్న ఎస్సీ!

By:  Tupaki Desk   |   10 Jun 2022 5:38 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షి గంగాధరరెడ్డి అలా చనిపోయారంటున్న ఎస్సీ!
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న గంగాధరరెడ్డి అనుమానాస్పద మృతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా యాడికిలో గురువారం తెల్లవారుజామున గంగాధరరెడ్డి తన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి విదితమే. దీనిపై అనంతపురం జిల్లా ఎస్సీ ఫకరప్ప వివరణ ఇచ్చారు.

గంగాధరరెడ్డి అనారోగ్య కారణాలతోనే మరణించాడని, ఇంకా ఏవిధమైన అనుమానాస్పద లక్షణాలు లేవని తేల్చిచెప్పారు. గంగాధరరెడ్డి మృతికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించే ఈ విషయం చెబుతున్నామని తెలిపారు. పోస్టుమార్టంలోనూ గంగాధరరెడ్డి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ఎస్పీ తాజాగా వెల్లడించారు. అనారోగ్యంతోనే గంగాధరరెడ్డి మృతి చెందాడని ఎస్పీ చెబుతున్నారు.

మరోవైపు గంగాధరరెడ్డి కుటుంబసభ్యులు సైతం అతడు అనారోగ్య కారణాలతోనే మృతి చెందాడని చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు మాత్రం గంగాధరరెడ్డి మరణం సహజ మరణం కాదని ఆరోపిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారంతా ఒకరి తర్వాత ఒకరు వరుసగా అనుమానాస్పద రీతిలో మృతి చెందుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మరణాలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరిపించాలని కోరుతున్నారు. నిందితులు బెయిల్ పై బయటకొచ్చి సాక్షులను చంపుతున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ వివేకా హత్య కేసును త్వరగా విచారించాలని కోరుతున్నారు.

కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డికి గంగాధరరెడ్డి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ ఇప్పటికే పలుమార్లు గంగాధరరెడ్డి విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని రెండుసార్లు సీబీఐ ఎస్పీని గంగాధరరెడ్డి కలవడం గమనార్హం.

వాస్తవానికి గంగాధరరెడ్డి (49) స్వగ్రామం పులివెందుల అయినప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకుని అనంతపురం జిల్లా యాడికిలో నివాసముంటున్నాడు. అతడిపై రౌడీ షీట్ కూడా ఉంది. పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పలువురి హత్యతోనూ సంబంధాలున్నాయి. సీబీఐ అధికారులు తనను బెదిరించి దేవిరెడ్డి శంకర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమంటున్నారని గంగాధరరెడ్డి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా వారిద్దరిని నిందితులని సాక్ష్యం ఇస్తే పది కోట్ల రూపాయలు ఇస్తామని తనకు ఆశపెట్టినట్టు గంగాధరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం రేపాడు.

కాగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తన తండ్రి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. 2021 అక్టోబర్ 26న ఛార్జిషీటును దాఖలు చేసింది. మరోవైపు సీబీఐ పులివెందులలో వివేకా హత్య కేసు విచారణను ముమ్మరం చేసింది. వివేకా ఇంటి కొలతలతో పాటు మరికొందరు అనుమానితుల సమాచారం సేకరిస్తోంది.