Begin typing your search above and press return to search.

ఎంబీబీఎస్‌ లో సీటు రాలేదని భార్యను కాల్చేశాడు

By:  Tupaki Desk   |   19 Sep 2017 11:34 AM GMT
ఎంబీబీఎస్‌ లో సీటు రాలేదని భార్యను కాల్చేశాడు
X
మాన‌వ సంబంధాల్లో - ముఖ్యంగా వైవాహిక సంబంధాలు ఎంత స్వార్థ‌పూరితం అవుతున్నాయో తెలుసుకునేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. భార్య‌కు ఎంబీబీఎస్ సీట్ రాలేద‌ని వేధించాడు ఓ ప్ర‌బుద్ధుడు. దీంతో ఆమె అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందింది. అయితే ఆమెది ఖ‌చ్చితంగా హ‌త్యేన‌ని అమ్మాయి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎల్బీనగర్ రాక్‌ టౌన్‌ కాలనీలో ఆదివారం రాత్రి ఓ వివాహిత ఒంటికి నిప్పంటించుకుని అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త క‌ల‌కలం రేపింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్తపై హత్య, వరకట్న వేధింపుల కేసును.. అత్తమామాలపై వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో భర్తతో పాటు అత్తమామలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు.

స‌ద‌రు వివాహిత‌ది హత్యా..లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే బాధితురాలి కుటుంబసభ్యులు మీడియాకు తెలిపిన వివ‌రాల ప్రకారం ఆ అమ్మాయిన చంపేశారు! ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం - కొత్తూరు - ఎరగడ్డ తండకు చెందిన బాణోతు కోక్యా కూతురైన హారిక (20)ను తన సొంత సోదరి కుమారుడైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం, బుద్ధారం గ్రామానికి చెందిన హరిచంద్ - అరుణ దంపతుల కుమారుడు రిషికుమార్ (28)కు ఇచ్చి 2015 మేలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో వరకట్నం కింద తమ గ్రామంలోని 2 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రూ.5 లక్షల నగదు ఇచ్చి పెళ్లి జరిపించారు. హారిక ఎంబీబీఎస్ సీటు సాధించాలని పెళ్లి జరిగినప్పటి నుంచి రెండేళ్లు హాస్టల్‌ లో పెట్టి ఎంసెట్ కోచింగ్ ఇప్పించాడు. అయితే హారికకు బీడీఎస్‌ లో సీటు వచ్చింది. దీంతో రెండేళ్ల నుంచి కోచింగ్ కోసం వెచ్చించిన డబ్బులతో పాటు అదనంగా మరో రూ. 5 లక్షలు తీసుకురావాలని రిషికుమార్‌ తో పాటు అత్తమామలైన హరిచంద్ - అరుణలు వేధించసాగారు. ఆదివారం సాయం త్రం కిరోసిన్ పోసి భర్త రిషికుమార్ తగులబెట్టారని మృతురాలి తల్లి బాణోతు లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు సంఘటన స్థలాన్ని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్‌ భగవత్ - ఎల్‌ బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌ రావులు పరిశీలించారు.

కాగా త‌మ బిడ్డ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్న‌ట్లు మృతురాలి తల్లిదండ్రులు మీడియాతో తెలిపారు. ``ఎంబీబీఎస్ సీటు సాధిస్తేనే సంసారం చేస్తానని షరతు పెట్టాడు. సీటు రాకపోవడంతో అదనపు కట్నం తేవాలంటూ ఒత్తిడి చేశాడు. సొంతంగా కాల్చుకుని ఉంటే మంటల వేడికి తాళలేక ఇటూ..అటూ పరుగెత్తేది. కానీ ఇంట్లో అలాంటి దాఖలాలు కనిపించలేదు. హారిక నాలుక బయటకు వచ్చింది. కాల్చుకుని చనిపోతే నాలుక బయటకు ఎలా వస్తుంది?`` అని అని మృతురాలి తల్లి - తండ్రి - సోదరి - బంధువులు ప్రశ్నించారు. భర్త రిషికుమారే హారికను ఉరివేసి చంపి కిరోసిన్ పోసి తగులబెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు