Begin typing your search above and press return to search.

పరీక్ష రాయాలంటే తాళి తీసేయాలా?

By:  Tupaki Desk   |   12 Nov 2016 10:30 AM GMT
పరీక్ష రాయాలంటే తాళి తీసేయాలా?
X
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పరీక్షల్లో అక్రమాల్లో నిరోధానికి గాను ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. పరీక్ష హాల్లో ఎలాంటి టెక్నాలజీని దొంగతనంగా వాడే అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశంతో కఠిన నిబంధనలు పెట్టారు. ఫుల్ హ్యాండ్సు షర్టులు వేసుకోరాదని.. బూట్లు వేసుకోరాదని.. అమ్మాయిలు చెవిరింగులు కూడా పెట్టుకోవద్దని ముందే సూచనలు చేశారు. ఈ క్రమంలో ఒక ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థిని మెడలో మంగళసూత్రం కూడా తీసేయమనడంతో ఆమె పరీక్ష రాయకుండా వెనక్కు వచ్చేసిన ఘటన ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. శతాబ్దాలుగా పాటిస్తున్న ఆచారాలు - సంప్రదాయాలను కూడా కాదనడం హక్కుల ఉల్లంఘనేనన్న వాదన వినిపిస్తోంది.

మొబైల్ ఫోన్లు తేకూడదు.. కాలిక్యులేటర్లు వాడకూడదు.. బ్లూటూత్ - హెడ్ ఫోన్సు ఉండకూడదు వంటి నిబంధనలను ఎవరూ కాదనరు. సరే... ఫుల్ హ్యాండ్సు చొక్కా వద్దు - షూ వద్దన్నా కూడా సర్దుకుపోతారు. కానీ... మహిళలు తమ పసుపుకుంకాలకు చిహ్నంగా భావిస్తూ.. తమ భర్తల ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలంటూ ఎంతో పవిత్రంగా పూజిస్తూ.. ఒక్క సెకను కూడా మెడలోంచి తీయడానికి ఇష్టపడని తాళిబొట్టును తీసేయమనడే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. హిందూ ఆచారాల్లో తాళి బొట్టుకు ఉన్న స్థానమేమిటో ఎవరినడిగినా చెబుతారు. నిబంధనల్లో దాన్ని తొలగించాలని పొందుపరచకపోయినా ఇన్విజిలేటర్లు అత్యుత్సాహంతో ఇలాంటి పనులు చేయడంతో ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి వెనుదిరగాల్సి రావడం బాధాకరమే.

నిజానికి పరీక్షల నిర్వహణ ఈ సాంకేతిక కాలంలో కత్తిమీద సామే. అయితే... అందుకు పరిష్కారం ఇలాంటి నిబంధనలు కావు. లోపాలకు తావులేని తనిఖీ వ్యవస్థతోనే ఇది సాధ్యమవుతుంది. అలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఉగ్రవాద భయం - స్మగ్లింగ్ నిరోధానికి గాను ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాల్లో కూడా ఎవరినీ తాళి తీయమని చెప్పరు. కాదంటే విమానం సమయం కంటే ఎంతో ముందే ప్రయాణికులను రప్పించి క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. అలాంటిది పరీక్ష రాసి ప్రభుత్వోద్యోగం సంపాదించాలని ఆశపడే వివాహితల స్ఫూర్తిని దెబ్బతీసేలా, వారి నమ్మకాలను దెబ్బతీసేలా వ్యవహరించడంపై విమర్శలొస్తున్నాయి. మరికొన్ని పరీక్ష కేంద్రాల్లోనూ ఇలాగే తాళి తీసేయమనడంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగిన మహిళల ఉదంతాలు కూడా వెలుగు చూశాయి.

అభ్యర్థులను ఇంతగా ఇబ్బందులుపెట్టే ప్రభుత్వాలు పరీక్ష పత్రాలు అభ్యర్థుల చేతికందకుముందే లీకవకుండా ఆపడంలో మాత్రం విఫలమవుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో టెక్నాలజీ ఏదీ పనిచేయకుండా ఆపే నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలే కానీ... ఇలా తాళి బొట్టు తీయమనడం మాత్రం సబబు కాదన్న వాదన వినిపిస్తోంది. మరికొన్నాళ్లకు అసలు ఒంటిపై ఏమీ వేసుకోకుండా నగ్నంగా పరీక్ష రాయమనేలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో దీనిపై జనం ఆగ్రహం వెల్లగక్కుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/