Begin typing your search above and press return to search.

అండాలు విక్రయిస్తున్న మహిళ అరెస్ట్..!

By:  Tupaki Desk   |   20 Jan 2023 2:30 PM GMT
అండాలు విక్రయిస్తున్న మహిళ అరెస్ట్..!
X
ఈజీ మనీ కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. టీనేజ్ వయస్సు నుంచి మొదలు పెడితే ముసలివాళ్ల వరకు ఈ జాబితాలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేరాలు కూడా కొత్త తరహాలో వెలుగులు చూస్తున్నాయి. కాగా ఓ మహిళ జల్సాలకు అలవాటుపడి ఏకంగా తన అండాలు అమ్ముకుంటుందనే విషయం వెలుగు చూడటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

ఈ విచిత్రమైన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని అమ్రైవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికీ మనస్పర్థలు రావడంతో తరుచూ గొడవలు పడేవారు. అత్తమామలతో గొడవకు దిగేది. దీంతో ఆమె భర్త తల్లిదండ్రులను వదిలి అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు.

అయితే భర్త ఆదాయం సరిపోవడం లేదనే ఆమె తరుచూ గొడవకు దిగేది. దీంతో భర్త ఆమెను వదిలేసి 2019లో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరి మధ్య సయోధ్య కుదరడంతో మళ్లీ కలిసి కాపురం చేస్తున్నారు. ఈక్రమంలోనే తన భార్య ఎవరికీ తెలియకుండా అండాలను విక్రయిస్తుందని సదరు భర్త గుర్తించాడు. ఈ విషయంలో భార్యను నిలదీయగా బయటకు చెబితే చంపేస్తానంటూ ఆమె బెదిరించిందని చెబుతున్నాడు.

అండాల విక్రయాల కోసం అహ్మదాబాద్ లోని ఓ ఏజెంట్ తో ఒప్పందం కుదుర్చుకుందని కనిపెట్టాడు. తన భార్యకు తన అత్త సహకరిస్తుందని నిర్ధారించుకున్నాడు. ఇదే విషయంపై పలుమార్లు వీరి మధ్య గొడవ జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన భార్య అండాల విక్రయాలకు పాల్పడుతుందని.. ఇందుకోసం ఆధార్ కార్డులో పుట్టిన తేది వివరాలు తప్పుడుగా మార్చుకుందని పోలీసులకు వివరించాడు.

అంతేకాకుండా భర్త అనుమతితోనే అండాలను విక్రయిస్తున్నట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 జనవరి నుంచి 2022 జూన్ మధ్యలో పలుమార్లు తన భార్య అండాలను విక్రయించి సొమ్ము చేసుకుందని ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఫోర్జరీ సహా పలు సెక్షన్ల కింద మహిళపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారం మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.