Begin typing your search above and press return to search.

గులాబీ ద‌ళానికి కొత్త భ‌యం?

By:  Tupaki Desk   |   11 Sep 2015 3:29 PM GMT
గులాబీ ద‌ళానికి కొత్త భ‌యం?
X
ఉద్య‌మంతో ఉరుకులు ప‌రుగులు తీయ‌ట‌మే కాదు.. ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ ప‌క్షాల్ని ప‌రుగులు పెట్టించిన టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి లోన‌వుతున్నారు. అధికారంలోకి వ‌చ్చి 15 నెల‌లు అవుతున్నా.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ప్ర‌ధాన హామీలు ఏమాత్రం తీర్చ‌లేకున్నా.. త‌ల‌కు మించిన హామీలు ఇచ్చిన ప‌రిస్థితి.

ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన‌ట్లుగా రుణ‌మాఫీని ఇచ్చిన‌ట్లు బ‌డాయి చెప్పుకున్నా.. విద్యుత్తు స‌మ‌స్య‌ను ఏడాదిలోనే అధిగ‌మించిన‌ట్లు చెప్పిన మాట్ల‌లోని ప‌స‌.. తాజాగా వెలుగు చూస్తున్న రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌తో స‌ర్కారు డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డుతోంది. పుట్టెడు అప్పుల‌తో.. బ‌తుకు బండిని లాగ‌లేక సొమ్మ‌సిల్లిపోతున్న అన్న‌దాత బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు.

దీనికితోడు.. స‌ర్కారుద‌న్ను లేక‌పోవ‌టం.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన వారి కుటుంబాల విష‌యంలో తెలంగాణ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై వ్య‌తిరేక‌త రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా.. హైద‌రాబాద్ న‌డిబొడ్డున క‌రెంటు స్తంభానికి ఉరేసుకొని త‌న‌వు చాలించిన లంబ‌య్య ఆత్మ‌హ‌త్య‌పై తెలంగాణ స‌ర్కారు త‌యారు చేసి.. విడుద‌ల చేసిన నివేదికపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది.

లంబ‌య్య ఆత్మ‌హ‌త్య‌కు వ్య‌వ‌సాయ అప్పులు కావ‌ని.. దీర్ఘ‌కాలికంగా ఉన్న వ్యాధులేనంటూ చేస్తున్న వ్యాఖ్య‌లు నిర‌స‌న సెగ‌లు పుట్టిస్తున్నాయి. ఒక‌వైపు రైతుల ఆత్మ‌హ‌త్య‌లు కొన‌సాగుతున్న ప‌రిస్థితుల్లో.. వాటికి అడ్డుక‌ట్ట ఎలా వేయాలో అర్థం కాక తెలంగాణ స‌ర్కారు త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన ముఖ్య‌నేత‌లు పాల్గొనే స‌భ‌ల్లో నిర‌స‌న వ్య‌క్తం చేసే ప‌నిలో భాగంగా తీవ్ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టం జ‌రుగుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు  పాల్గొన్న కార్య‌క్ర‌మంలో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకొని క‌ల‌క‌లం సృష్టించింది.

అదిలాబాద్ జిల్లా బెల్లంప‌ల్లి మార్కెట్ యార్డులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఒక మ‌హిళ పాల్గొని.. త‌న భూమిని తాండూరు జెడ్పీటీసీ ఆక్ర‌మించుకున్నారంటూ ఏదో ఒక ద్ర‌వాన్ని తాగేయ‌టం క‌ల‌క‌లం రేగింది. త‌క్ష‌ణ‌మే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తెలంగాణ ఉద్య‌మంలో ఏ బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌తో ఉద్య‌మాన్ని మ‌రింత ప‌ట్టును పెంచిందో.. ఇప్పుడు అవే బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు.. నిర‌స‌న ఘ‌ట‌న‌లు తెలంగాణ స‌ర్కారుకు కొత్త భ‌యాన్ని క‌లిగిస్తున్నాయి. ఏ నిమిషాన ఎవ‌రు ఎక్క‌డ ఎలాంటి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తారో.. ఎలాంటి అఘాత్యాల‌కు పాల్ప‌డ‌తారోన‌న్న భ‌యం గులాబీద‌ళంలో క‌నిపిస్తోంది.