Begin typing your search above and press return to search.

ఆ రెండు పత్రికల వల్లేగా నువ్వు పైకొచ్చింది.. వల్లభనేని వంశీకి మహిళ ఘాటు కౌంటర్‌!

By:  Tupaki Desk   |   9 Nov 2022 7:03 AM GMT
ఆ రెండు పత్రికల వల్లేగా నువ్వు పైకొచ్చింది.. వల్లభనేని వంశీకి మహిళ ఘాటు కౌంటర్‌!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్‌ జగన్‌.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు.

అయితే ఇంత చేస్తున్నా ప్రజల నుంచి కొంతమందికి నిరసనలు తప్పడం లేదు. అభివృద్ధి లేదని, తమకు పథకాలు అందడం లేదని ప్రజలు పలుచోట్ల ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మీడియాలో పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఎక్కడికక్కడ ప్రజలు వివిధ సమస్యలపై నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక.. సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేస్తున్నారని అంటున్నారు. మరికొంతమంది పోలీసులతో తమను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించడం వంటివి చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ౖవైసీపీ అనుబంధ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైందని సమాచారం.

వల్లభనేని వంశీమోహన్‌ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరులో పర్యటించారు. ఈ క్రమంలో సీహెచ్‌ భవాని అనే మహిళ వచ్చి 'గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. మీ జగన్‌ను అడిగి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకురండి'.. అని ఆయనకు సూచించారు.

మహిళ అడిగిన దానికి స్పందిస్తూ వల్లభనేని వంశీ.. 'చూడండి అక్కా.. మీరు 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలను బాగా చూస్తున్నట్లున్నారు' అంటూ వ్యంగ్యంగా అన్నారు. దానికి ఆ మహిళ 'మీరు పెద్దవాళ్లు అయ్యింది ఆ పత్రికల వల్లేగా' అంటూ ఘాటు కౌంటర్‌ ఇచ్చారు.

మళ్లీ దీనికి వల్లభనేని వంశీ స్పందిస్తూ.. 'ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోవడంతో చాలా కంపెనీలు వెళ్లిపోయాయి' అని వివరించారు.

మరోవైపు సమస్యల గురించి ఎమ్మెల్యే వంశీ మహిళలతో మాట్లాడుతుండగా వలంటీరు ఒకరు ఈ ఫొటోలు తీశారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆ ఫొటోలను డిలీట్‌ చేయించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.