Begin typing your search above and press return to search.

17 నెలల గర్భిణి.. ప్రపంచ రికార్డు కోసం!!

By:  Tupaki Desk   |   22 Aug 2016 7:52 AM GMT
17 నెలల గర్భిణి.. ప్రపంచ రికార్డు కోసం!!
X
సాధారణంగా గర్భం తొమ్మిది నెలలు ఉంటుంది - కొన్ని అరుదైన సంఘటనల్లో పదినెలలు ఉంటుంది - మరి కొన్ని సందర్భాల్లో ఏడెనిమిది నెలలకే డెలివరీ అయిపోతుంటుంది. కానీ.. ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం అత్యంత అరుదైన సంఘటనగానే భావించాలి. అదేమిటంటే.. ఒక మహిళ తాను 17నెలలుగా గర్భవతిగానే ఉన్నానని ముందుకురావడం. ఒక మహిళ 17నెలలుగా (సాదారణ సమయానికంటే దాదాపు రెట్టింపు) గర్భిణిగా ఉంది అని చెబుతున్న ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనా హునాన్ ప్రావిన్స్ - తియాన్సింగ్ నగరానికి చెందిన వాంగ్ షి అనే మహిళ... తాను 17 నెలల గర్భిణినని - ప్రపంచ రికార్డుకు అర్హురాలినని క్లైమ్ చేసిన సంఘటన తాజాగా వెలుగోకి వచ్చింది. రికార్డుల కోసమే ఇలా ప్రయత్నించిందా, లేక అలానే జరిగిపోయిందా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే.. గత ఏడాదే గర్భం ధరించిన ఆమె.. 17 నెలల పాటు ప్రసవం కాకుండా గర్భిణిగానే ఉండిపోయిందట. ఇలా సుదీర్థకాలంపాటు గర్భాన్ని ధరించిన మహిళగా రికార్డు సృష్టించానని - ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తుంది. లెక్క ప్రకారం 2015 నవంబర్ నెలలో వాంగ్ షి కి ప్రసవం కావాల్సి ఉండగా.. డ్యూ డేట్ దాటి సుమారు ఎనిమిది నెలలు పూర్తయిన తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 18న ఆమెకు ప్రసవం అయ్యింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా (మాయ) సరిగా పెరగకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది.

తొమ్మిది నెలల తర్వాత కూడా ప్రసవం కాకపోవడంతో వాంగ్ షి స్థానిక ఆస్పత్రికి వెళ్ళింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని - ప్రసవానికి కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. డ్యూ డేట్ దాటిపోవడంతో ఆందోళనలో పడ్డ వాంగ్ సహా.. ఆమె భర్త పది రోజులకోసారి చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకువెళ్తూనే ఉన్నారట. అయితే ఒకసారి 14 నెలలు గర్భం ఉన్న సమయంలో ప్రసవానికి సిద్ధమైన వాంగ్ ను వైద్యులు ఇంకొంత కొంతకాలం ప్రసవంకోసం వేచి చూడాల్సి ఉందని సూచించారట. అయితే ఆగస్టు 18న విజయవంతంగా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

కాగా 1945 సంవత్సరంలో ఆమెరికాకు చెందిన బ్యూలా హంటర్ అనే మహిళ 375 రోజుల పాటు గర్భంతో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయట. అయితే చైనా ప్రభుత్వం కూడా ఈ మేరకు వాంగ్ షి తరుపున ఈ విషయాన్ని నిర్ధారిస్తూ సర్టిఫికెట్ జారీ చేస్తే ఈమె గత రికార్డును తిరగరాసినట్లేనని పీపుల్స్ డైలీ వెల్లడించింది.