Begin typing your search above and press return to search.

ఈ మంత్రి గారి నుంచి ఆ మహిళకు ప్రాణ హానీ ఉందట

By:  Tupaki Desk   |   17 Feb 2020 3:55 PM GMT
ఈ మంత్రి గారి నుంచి ఆ మహిళకు ప్రాణ హానీ ఉందట
X
టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. తన భూమిని మంత్రి గారు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, దానిని అడ్డుకోవడమే నేరమన్నట్లుగా తనకు మంత్రి నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఓ మహిళ నేరుగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నే ఆశ్రయించింది. అంతేకాకుండా ఆమె మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహానీ ఉందని. మంత్రి నుంచి తనను రక్షించాలని కూడా బాధిత మహిళ హక్కుల కమిషన్ ను వేడుకుంది. తెలంగాణలో పెను కలకలం రేపుతున్న ఈ వివాదంతో మంత్రి మల్లారెడ్డికి ఏ రకమైన ప్రమాదం పొంచి ఉందోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... పి.శ్యామలా దేవి అనే మహిళకు హైదరాబాద్ శివారు సురారం పరిధిలో ఒక ఎకరా 33 గుంటల భూమి ఉందట. ఈ భూమి సూరారం, మల్లారెడ్ది హాస్పిటల్ మధ్యలో ఉందట. ఈ భూమికపై కన్నేసిన మంత్రి మల్లారెడ్డి... దానిని కబ్జా చేసేందుకు యత్నించారట. అయితే తన భూమిని కాపాడుకునే నిమిత్తం మల్లారెడ్డి కబ్జా యత్నాలను శ్యామలాదేవి అడ్డుకున్నారట. అంతే.. మంత్రి మల్లారెడ్డి తన అధికార దండాన్ని తీశారట. తన భూమిని కాపాడుకునేందుకు శ్యామలాదేవి రెవెన్యూ అధికారులను సంప్రదించారట. అయితే అధికారులు మల్లారెడ్డి వైపే మాట్లాడటంతో చేసేది లేని శ్యామలా దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారట.

అయితే రెవెన్యూ అధికారుల మాదిరే పోలీసులు కూడా మంత్రి మల్లారెడ్దికే వంత పాడుతూ శ్యామలా దేవి ఫిర్యాదును తీసుకునేందుకే నిరాకరించారట. అదే సమయంలో శ్యామలా దేవి అటు అధికారులను, ఇటు పోలీసులను సంప్రదిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి... ఆమెను బెదిరింపులకు గురి చేశారట. ఇక తన భూమిని కాపాడుకునే మార్గం కనిపించని శ్యామలాదేవి... అంతిమ అస్త్రంగా మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించారట. ఈ సందర్భంగా జరిగిన తంతును మొత్తం ఆమె తన ఫిర్యాదు ద్వారా మానవ హక్కుల కమిషన్ కు తెలియజేశారట. మరి మానవ హక్కుల కమిషన్ అయినా శ్యామలా దేవి భూమి కబ్జాకు గురి కాకుండా కాపాడుతుందో, లేదో చూడాలి.