Begin typing your search above and press return to search.

టిక్ టాక్ వాడొద్ద‌న్న భ‌ర్త మాట‌తో భార్య సూసైడ్!

By:  Tupaki Desk   |   13 Jun 2019 6:09 AM GMT
టిక్ టాక్ వాడొద్ద‌న్న భ‌ర్త మాట‌తో భార్య సూసైడ్!
X
స‌ర‌దాగా మొద‌లై.. ఆ త‌ర్వాత అందులో నుంచి బ‌య‌ట‌కు రాలేని రీతిలో క‌ట్టిపారేసే సోష‌ల్ మీడియా వ్య‌స‌నం ఇప్పుడు ఎక్కువైంది. అలాంటి వినోదాల జాబితాలో టిక్ టాక్ ఒక‌టి. టైంపాస్ కావ‌ట్లేద‌ని.. బోర్ కొడుతుందంటూ మొబైల్ తో గ‌డిపే వారు.. టిక్ టాక్ యాప్ తో ఇట్టే క‌నెక్ట్ అయిపోతుంటారు. రెండు రోజులు వ‌రుస‌గా చూస్తే చాలు మూడో రోజు నుంచి మీ మ‌న‌సు దాని వైపే లాగేలా చేసుకునే మ‌హ‌త్యం టిక్ టాక్ సొంతం. తాజాగా దీని కార‌ణంగా ఒక మ‌హిళ త‌న జీవితాన్ని అర్థాంత‌రంగా ముగించేసుకుంది.

తమిళ‌నాడులోని అరియలూరు జిల్లా సెందురైలోని వంగారం గ్రామానికి చెందిన 24 ఏళ్ల అనిత‌తో ప‌ళ‌నివేలుకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జ‌రిగింది. భ‌ర్త సింగ‌పూర్ లో ఉద్యోగం.. భార్య ఏమో పిల్ల‌ల‌తో ఊళ్లో ఉన్న‌నేప‌థ్యంలో ఆమెకు టిక్ టాక్ అల‌వాటైంది. చాలా త్వ‌ర‌గా దానికి అక‌ర్షితురాలైన ఆమె.. డ్యాన్సులు చేయ‌టం.. డైలాగుల‌తో వీడియోలు పెట్టేది. ఈ విష‌య‌మై ఆమె బంధువులు.. ప‌ళ‌నివేలుకు చెప్పేవారు. ఈ వీడియో గొడ‌వ‌లో ఇద్ద‌రు పిల్ల‌ల్ని స‌రిగా చూసుకోవ‌టం లేద‌న్న మాట‌పై భార్య‌ను భ‌ర్త త‌ర‌చూ మంద‌లించేవారు.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌నే కొడుకు కింద‌ప‌డి గాయాల‌పాలు కావటం.. టిక్ టాక్ వీడియోల హ‌డావుడిలో పిల్లాడి గురించి ప‌ట్టించుకోలేద‌న్న మాట‌తో భ‌ర్త సీరియ‌స్ అయ్యారు. భార్య‌ను తీవ్రంగా మంద‌లించారు. దీంతో మ‌న‌స్థాపానికి గురైన ఆమె.. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. విషం తాగుతూ.. ఇదే త‌న చివ‌రి వీడియో అంటూ త‌న సూసైడ్ ను వీడియోగా మ‌లిచి త‌నువు చాలించింది. టిక్ టాక్ లో ఈ వీడియో సంచ‌ల‌నంగా మారింది. మ‌నుషుల మ‌ధ్య దూరాన్ని పెంచే మాయ‌దారి యాప్ ల జాబితాలో టిక్ టాక్ చేరింద‌న్న విమ‌ర్శ ఇప్పుడు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.