Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్.. ఆప్ డేట్స్ ఏమిటంటే

By:  Tupaki Desk   |   9 Dec 2019 6:52 AM GMT
హైదరాబాద్ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్.. ఆప్ డేట్స్ ఏమిటంటే
X
హైదరాబాద్ లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద నుంచి కారు పడటం - దారిన పోతున్న అమాయకులు ఆ ప్రమాదంలో ఒకరు చనిపోవడం - ఇతరులు గాయపడటం.. సంచలనం రేపిన ఘటన. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. సంచలనం రేపిన ఈ ఘటన ఆ తర్వాత వార్తల్లో కనిపించడం లేదు.

ఆ యాక్సిడెంట్లో ఊహించని విధంగా కొందరు ప్రమాదం పాలయ్యారు. 56 యేళ్ల సత్యవతి అనే మహిళ ఆ ప్రమాదంలో మరణించారు. కుబ్రా అనే అనంతపురం జిల్లాకు చెందిన యువతి తీవ్రంగా గాయాలపాలైంది. ఆమెకు వైద్యానికి కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆమెకు ఏపీ ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది.

ఆమె వైద్య చికిత్స బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంది. ఇక ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఊహించని రీతిలో వారు ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. ఈ యాక్సిడెంట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని వారు అంటున్నారు. కారు నడిపిన కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావు అనే వ్యక్తి 40 కిలోమీటర్ల వేగంతో రావాల్సిన చోట వంద కిలోమీటర్ల పై వేగంతో నడిపాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు.

అతి వేగం వల్లనే కారు అదుపు తప్పి ప్లై ఓవర్ నుంచి కింద పడిందని వారు పేర్కొన్నారు. దీనికి గానూ అతడిపై కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. అయితే తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తి కూడా. తనకు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారని అతడు చెబుతున్నాడట.

అలాగే తను అతి వేగంతో వెళ్లలేదని ఫ్లై ఓవర్ డిజైన్ లో తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని అతడు వాదిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అతడి అరెస్టు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇరు పక్షాల వాదనల నేపథ్యంలో ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి సంగతెలా ఉన్నా.. ఈ ప్రమాదంతో ఏ మాత్రం ప్రమేయం లేని వారు తీవ్రంగా బాధింపబడ్డారు.