Begin typing your search above and press return to search.

కింద ప‌డిన ఫోన్ తీసుకుంటే ప్రాణం పోతుందా?

By:  Tupaki Desk   |   4 July 2019 4:45 AM GMT
కింద ప‌డిన ఫోన్ తీసుకుంటే ప్రాణం పోతుందా?
X
జ‌స్ట్.. కింద‌ప‌డిన ఫోన్ తీసుకోవ‌టం ప్రాణం పోయేలా చేస్తుందా? అందుకు మూల్యంగా ప్రాణాన్నే ప‌ణంగా పెట్టాల్సి వస్తుందా?.. అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. కానీ.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని చూసిన‌ప్పుడు కింద ప‌డిన ఫోన్ తీసుకున్న‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త గురించి హెచ్చ‌రిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

హైద‌రాబాద్ కు చెందిన సీతాఫ‌ల్ మండికి ద‌గ్గ‌ర‌లో ఉండే అశ్విని విష‌యాన్ని చూస్తే.. అయ్యో అనిపించ‌క మాన‌దు. 22 ఏళ్ల అశ్విని బేగంపేట నేచ‌ర్ క్యూర్ ఆసుప‌త్రి స‌మీపంలో ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్ లో ప‌ని చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆమె ఉద‌యం ఆఫీసుకు వెళ్లేందుకు సీతాఫ‌ల్ మండిలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. తాను దిగాల్సిన స్టాప్ వ‌స్తుండ‌టంతో.. ఆమె రైలు దిగేందుకు డోర్ కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి నిల‌బ‌డింది.

అదే స‌మ‌యంలో ఆమె చేతిలో ఫోన్ పొర‌పాటున డోర్ ద‌గ్గ‌రే కింద ప‌డింది. దాన్ని తీసుకునే క్ర‌మంలో ఆమె ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. పొర‌పాటున రైల్లో నుంచి జారి కింద‌కుప‌డ‌టం.. ఆమె శ‌రీరం రైలుప‌ట్టాల మీద ప‌డి.. రెండు ముక్క‌లుకావ‌టం క్ష‌ణాల్లో జ‌రిగిపోయాయి. ఈ ఉదంతం అక్క‌డి వారిని షాక్ కు గురి చేసింది. జారి ప‌డిన ఫోన్ ను తీసుకోవ‌టానికి ప్రాణ‌మే ప‌ణంగా పెట్టాల్సి రావ‌టాన్ని జీర్ణించుకోలేని ప‌రిస్థితి.

ఈ ఉదంతం విన్నోళ్లే వ‌ణికే ప‌రిస్థితి అయితే.. దాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసినోళ్లు మ‌రెంత భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతారో మాటల్లో చెప్ప‌లేనిది. ఇదిలా ఉంటే.. త‌మ కుమార్తె మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక అశ్విని త‌ల్లిదండ్రుల శోకం ఆప‌టం ఎవ‌రి త‌రం కాలేదు. ఉద్యోగం చేసేందుకు వెళ్లిన కుమార్తె.. ఇక ఇంటికి శాశ్వితంగా తిరిగి రాద‌న్న బాధ ఎవ‌రు మాత్రం తీర్చ‌గ‌ల‌రు?