Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దుః మోడీపై కేసు..పార్టీ ఎంపీల‌కు శిక్ష‌ణ‌!

By:  Tupaki Desk   |   25 Nov 2016 9:56 AM GMT
నోట్ల ర‌ద్దుః మోడీపై కేసు..పార్టీ ఎంపీల‌కు శిక్ష‌ణ‌!
X
పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు విప‌క్షాలు దీనిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌గా...తాజాగా సామాన్యులు సైతం త‌మ ఆక్రోశాన్ని వెల్ల‌గక్కుతున్నారు. తాజాగా నమోదైన ఓ ఫిర్యాదు ఇందుకు నిద‌ర్శ‌నం. తన భర్త మరణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీయే కారణమని ఆరోపిస్తూ ఓ మహిళ గురువారం ఫిరంగిపురం పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఆంధ్రాబ్యాంకులో నోట్ల మార్పిడికి వెళ్లి కోలంకి ఇన్నయ్య క్యూ లైన్‌ లోనే మృతి చెందాడు. ఈ మేరకు ఆయ‌న భార్య రోజ్‌ మేరి తన కుటుంబసభ్యులతో కలసి ఫిర్యాదు చేసేందుకు స్థానిక‌ పోలీసు స్టేషన్‌ కు వచ్చింది. అయితే పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారు. ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉండ‌గా పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు టీజెఆర్‌ సుధాకర్‌ బాబు సైతం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కాగా....పెద నోట్ల రద్దుపై అటు పార్లమెంటులోనూ, ఇటు వెలుపల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ పార్లమెంటు సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూలును కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. నోట్ల రద్దుపై సీనియర్‌ మంత్రులు అరుణ్‌ జైట్లీ - రాజ్‌ నాథ్‌ సింగ్‌ - సురేశ్‌ ప్రభు - ఎం వెంకయ్యనాయుడు - జేపీ నడ్డాల బృందం బీజేపీ ఎంపీలకు క్లాసులు తీసుకోనున్నారు. మొదటి విడతగా 40 మంది ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ నివాసంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. శ‌నివారం రెండో విడ‌త శిక్ష‌ణ ఉంటుంద‌ని స‌మాచారం.

మ‌రోవైపు నోట్ల రద్దును వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్షాలు పట్టు బిగిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ లోక్‌ సభ నియోజక వర్గమైన వారణాసితో సహా దేశవ్యాప్తంగా ఆరు ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆప్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ లో మూడు ర్యాలీలను నిర్వహించనున్నట్లు ఆప్‌ నేత ఆశిష్‌ ఖేతన్‌ చెప్పారు. మీరట్‌ - వారణాసి - లక్నోల్లో డిసెంబరు 1 - 8 - 18 తేదీల్లో నిర్వహించబోయే ర్యాలీలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వం వహించనున్నారు. అనంతరం భోపాల్‌ - రాంచీ - జైపూర్‌ ల్లో డిసెంబరు 20 - 22 - 23 తేదీల్లో ర్యాలీలు నిర్వహిస్తారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంపైనా, దీని వెనకున్న రూ. 8 లక్షల కోట్ల కుంభకోణంపైనా ప్రభుత్వాల‌న్ని ప్రశ్నిస్తామని ఖేతన్‌ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/