Begin typing your search above and press return to search.

కారు తాకిందని.. బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసిన హైదరాబాద్ మహిళ

By:  Tupaki Desk   |   17 Oct 2022 4:36 AM GMT
కారు తాకిందని.. బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసిన హైదరాబాద్ మహిళ
X
హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్కు.. ఆ సందర్భంగా కొందరు వ్యవహరించే తీరు తరచూ గొడవలకు కారణమవుతుంటుంది. తాజాగా అలాంటి ఉదంతంలో ఒక మహిళ వ్యవహరించిన తీరు రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. పోలీసులు తమకు బంధువులుగా ఉంటే ఏం చేసినా ఫర్లేదా? అన్నట్లు ఉన్న తీరును పలువురు తప్పు పడుతున్నారు. మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో టీ కేర్ కమాన్ వద్ద ఒక మహిళ తన కుటుంబంతో కారులో ప్రయాణిస్తోంది. కారు ముందు అద్దం వద్ద పోలీస్ అంటూ బోర్డు పెట్టుకున్నారు.

వారి కారును వేరే కారు తాకుతూ ముందుకు వెళ్లింది. దీంతో ఆ కారును ఆపారు. కారులో ప్రయాణిస్తున్న మహిళ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. బండ బూతులు తిట్టటమే కాదు.. సదరు కారు నడిపిన వ్యక్తి మీద చెప్పుతో దాడి చేశారు. దీంతో చుట్టూ ఉన్న వారంతా ఆమెను నిలువరించారు.

అసలేం జరిగిందంటూ రిపోర్టర్ ఒకరు తన ఫోన్ కెమేరాతో మాట్లాడుతూ చిత్రీకరిస్తుంటే.. వీడియో ఎందుకు తీస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను టీచర్ ను అని చెప్పిన ఆమె.. కారు తాకితే.. చెప్పుతో కొడతారా? పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు.

కోపంతో ఊగిపోతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కారును తాకించిన వ్యక్తిని పట్టుకొని చెప్పుతో కొడుతూ.. రూ.10వేలు కట్టరా? అంటూ రాయలేని బూతులు తిట్టేయటం గమనార్హం. ఇంతకీ మహిళ ప్రయాణిస్తున్న కారు ముందున్న పోలీస్ బోర్డు గురించి అడిగినప్పుడు.. తన మామ చంద్రయ్య కుకట్ పల్లి సీఐగా పని చేస్తున్నట్లుగా సదరు మహిళ పేర్కొన్నారు. కారుకు పోలీస్ అంటూ బోర్డు పెట్టుకొని.. ఇలా హల్ చల్ చేయటం ఏమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సదరు మహిళ తీరును అక్కడి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పుతో దాడి చేసి.. బండ బూతులు తిట్టిన మహిళ క్షమాపణలు చెప్పాలని.. అప్పటి వరకు వదిలే ప్రసక్తే లేదని కారును చుట్టుముట్టారు. చివరకు పోలీసు కానిస్టేబుల్ వచ్చి కారును మీర్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు.

కారును తప్పుగా డ్రైవ్ చేసి.. కారుకు డ్యామేజ్ జరిగేలా వ్యవహరించే వారిపైచర్యలు తీసుకోవాల్సిందే. అయితే.. అదంతా చట్టబద్ధంగా జరగాల్సిన వ్యవహారం. అంతే తప్పించి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించటం సరికాదు. మరి.. పోలీసులు ఏం చేస్తారో చూడాలి. సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఉదంతం హడావుడి చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.