Begin typing your search above and press return to search.

ఎంత మోసం: యోగా మ్యాట్ బ‌దులు డ్ర‌గ్స్‌

By:  Tupaki Desk   |   7 Oct 2017 10:06 AM GMT
ఎంత మోసం: యోగా మ్యాట్ బ‌దులు డ్ర‌గ్స్‌
X
న‌చ్చిన వ‌స్తువులు - అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను ఇంటి నుంచే షాపింగ్ చేసే వెసులుబాటు తెచ్చిన ఆన్‌ లైన్ షాపింగ్‌ లో ఇటీవ‌ల కాలంలో మోసాలు భారీ ఎత్తున పెరిగిపోయాయి. సెల్ ఫోన్ బుక్ చేస్తే.. మ‌ట్టిగ‌డ్డ రావ‌డం - ఫ్రిజ్ బుక్ చేస్తే.. చెత్త‌డ‌బ్బాలు రావ‌డం ఇటీవ‌ల కాలంలో మ‌నం చూశాం. అయితే, వీట‌న్నింటి కంటే ఘోరంగా ఓ మ‌హిళ చేసిన బుకింగ్ స్థానంలో ప్ర‌పంచం హ‌డ‌లి పోతున్న డ్ర‌గ్స్ భారీ ఎత్తున వ‌చ్చి ప‌డ్డాయి. దీంతో స‌ద‌రు మ‌హిళ ఒక్క‌సారిగా ఒణికిపోయింది. వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించి విష‌యం చెప్పింది. వివ‌రాలు చూద్దాం..

అమెరికాలోని యార్క్ కౌంటీలో ఉన్న రాక్‌ హిల్‌ లో ఓ మ‌హిళ నివాసం ఉంటోంది. ఈమెకు యోగా అంటే విప‌రీత‌మైన ఆస‌క్తి. అయితే, స‌రైన యోగా మ్యాట్ లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమె యోగా మ్యాట్ కోసం ఆన్‌ లైన్‌ లో బుక్ చేసింది. . రెండు రోజుల తర్వాత డెలివరీ బాయ్ వచ్చి ఆమె చేతిలో ఓ పార్సిల్ పెట్టాడు. దీంతో ఇక‌, యోగా చేసుకోవ‌డం సులువ‌వుతుంద‌ని ఆ మ‌హిళ ఆనందంతో గంతేసింది. అయితే, తీరా ఆ పార్సిల్ విప్పి చూడ‌గా.. అందులో రూ.రెండు కోట్ల విలువైన 20వేల నార్కోటిక్ పిల్స్ ద‌ర్శ‌న మిచ్చాయి. దీంతో స‌ద‌రు మ‌హిళ నిర్ఘాంత పోయింది.

దీంతో ఉలిక్కి ప‌డి వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. రాక్ హిల్ పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ పార్సిల్‌లో వ‌చ్చిన ప్యాకెట్ల‌లో ఒక్కోదాంట్లో పదివేల పిల్స్ ఉన్న రెండు సంచులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో పిల్ విలువ 20 డాలర్లు ఉంటుందని, వాటి మొత్తం విలువ 4 లక్షల డాలర్లు (దాదాపు రూ.2.6 కోట్లు) ఉంటుందని చెప్పారు. కాలిఫోర్నియా నుంచి ఈ డ్రగ్స్ వచ్చినట్టు యూనిట్ కమాండర్ మార్విన్ బ్రౌన్ తెలిపారు. తనపేరు, అడ్రస్‌ ను ఉపయోగించుకుని ఎవరో ఈ పనిచేసి ఉంటారని బాధిత మహిళ తెలిపింది. మొత్తానికి ఈ నిర్వాకంతో ఆన్‌లైన్ మోసాలు ప‌రాకాష్టకు చేరాయ‌ని పోలీసులు సైతం అంగీక‌రిస్తున్నారు.