Begin typing your search above and press return to search.

మరీ.. ఇంత ప్రేమా? నావల్ల కాదు.. విడాకులు ఇప్పించండి?

By:  Tupaki Desk   |   22 Aug 2020 11:30 PM GMT
మరీ.. ఇంత ప్రేమా? నావల్ల కాదు.. విడాకులు ఇప్పించండి?
X
ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు చూస్తే.. నవ్వాలో.. ఏడవాలో అర్థం కాదు. చక్కటి మొగుడు.. ప్రేమగా చూసుకోవటం.. పల్లెత్తు మాట అనకుండా ఉండటం.. ఇంటి పనుల్లో సాయం చేయటం.. ఏదైనా పొరపాటు చేస్తే.. లైట్ తీసుకోవటం లాంటివి ఏ భార్య అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తన భర్త చూపించే ప్రేమను భరించలేకపోతున్నానని.. అతనితో కలిసి ఉండటం తన వల్ల కాదని ఆమె పేర్కొంటోంది.

ఏదో మాట వరసకు కాదు.. అదే పనిగా విడాకుల కోసం కోర్టులకు.. పెద్ద మనషుల వద్దకు వెళ్లి పంచాయితీ పెడుతున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీకి చెందిన ఒక మహిళకు ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. భర్త ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమెకు ఇప్పుడుఅదే పెద్ద సమస్యగా మారింది. తనపై చూపిస్తున్న అతి ప్రేమను తాను తట్టుకోలేకపోతున్నట్లుగా ఆమె వాపోతోంది.

ఇంటి పనితో పాటు.. వంటలోనూ సాయం చేస్తాడని.. ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమిస్తాడని పేర్కొంది. ఎప్పుడూ కోప్పడడని.. అతనితో గొడవపడాలని తనకు ఉంటుంది కానీ ఆ అవకాశం ఇవ్వడని పేర్కొంటోంది. ఇంత ప్రేమను తాను తట్టుకోలేనని.. ఈ వాతావరణంలో తాను ఇమిడలేకపోతున్నట్లుగా పేర్కొంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ భార్యమణి సమస్యను విన్న షరియా కోర్టు గుమస్తా.. అవాక్కు కావటమే కాదు.. ఇలాంటి కేసుల్ని కోర్టు ఒప్పుకోదని చెప్పి వెనక్కి పంపాడు.

దీంతో.. ఆమె మత పెద్దల్ని కలిసి.. తనకు విడాకులు ఇవ్వాలని కోరుతోంది. కంటికి రెప్పలా చూసుకునే భర్త ఉన్నప్పుడు.. కలిసి కాపురం చేయక.. విడిపోవాలనుకోవటం ఏమిటి? అన్న ప్రశ్నతో పాటు.. ఇలాంటివి భార్యభర్తలు మాట్లాడుకొని సర్దుకోవాలంటూ సలహా ఇస్తూ పంపిస్తున్నారు. సదరు భార్యమణి మాత్రం అందుకు భిన్నంగా.. ఏదోలా తన భర్త నుంచి విడిపోయి.. అంత ప్రేమకు దూరంగా ఉండాలని కోరుకుంటుందట. ఇలాంటి వాళ్లను ఏమనాలి?