Begin typing your search above and press return to search.

మ‌హిళ‌ల‌కు వైర‌స్ క‌ష్టాలు: ఉపాధి లేక గ‌ర్భం అమ్ముకుంటున్న మ‌హిళ‌లు

By:  Tupaki Desk   |   21 July 2020 3:45 AM
మ‌హిళ‌ల‌కు వైర‌స్ క‌ష్టాలు: ఉపాధి లేక గ‌ర్భం అమ్ముకుంటున్న మ‌హిళ‌లు
X
ఒక వైర‌స్ మాన‌వ ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేస్తోంది. ఆ వైర‌స్ వ్యాప్తితో కొన్నాళ్లు ప్ర‌పంచ‌మంతా నిశ‌బ్ధంగా మారిన విష‌యం తెలిసిందే. దాని ప్ర‌భావంతో ప్ర‌స్తుతం అన్ని రంగాలు కుదేల‌య్యాయి. ఒక 20 ఏళ్ల వెన‌క్కు ప్ర‌పంచం వెళ్లింది. తీర‌ని న‌ష్టాల పాలైన రంగా‌లు ఎన్నో ఉన్నాయి. ఆ వైర‌స్ వ్యాప్తి అడుక్కునే వాడి నుంచి అప‌ర కుబేరుల‌ను కూడా తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. దీని ధాటికి పేద‌.. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తట్టుకోలేక‌పోతున్నారు. ఆ ప్ర‌భావం ప్ర‌స్తుతం ఉద్యోగ‌.. ఉపాధి అవ‌కాశాల‌పై తీవ్రంగా ప‌డింది. న‌ష్టాలు పూడ్చుకునేందుకు సంస్థ‌లు.. యాజ‌మాన్యాలు త‌మ ఉద్యోగుల‌ను తొల‌గించేస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మారుతున్నారు. ఈ ప‌రిస్థితి పేద‌.. మ‌ధ్య త‌ర‌గ‌తి అధికంగా ఉండే హైద‌రాబాద్‌లో తీవ్రంగా ఉంది. ఇలాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన చాలామంది మహిళలు కుటుంబ పోష‌ణ‌.. సంపాదన కోసం కొత్త కొత్త ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు మ‌రింత ముంద‌డుగు వేసి ఊహించని విధంగా పొట్ట‌కూటి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అదే అద్దె గర్భం దాల్చడం (సరోగసీ), అండాలను దానం చేయడం వంటి పనులు చేస్తున్నారు. ఇది హైద‌రాబాద్‌లో చాటుమాటుగా సాగుతున్న వ్య‌వ‌హారం. ఇది త‌ప్పు కాదు.. అలా అని ఒప్పు కాదు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌ప్ప‌డం లేద‌ని ఆ మ‌హిళ‌లు చెబుతున్న మాట‌. ఉపాధి లేక ఆదాయం కోసం ఈ ప‌ని చేస్తున్న‌ట్లు వారు వారి ద‌యానీయ ప‌రిస్థితి చెబుతున్నారు. ఇదంతా చేస్తున్న వారంతా 25-35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే. సరోగేట్ మదర్‌గా మారడానికి సిద్ధపడుతున్నారు.

ఈ ప‌ని చేస్తున్నందుకు వారికి పెద్ద మొత్తంలో అందుతోంది. సరోగేట్ మదర్‌కు రూ.5 లక్షల వరకు ఇస్తుండగా.. అండం దానం చేసే వారికి దాదాపు రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. దీంతో మ‌హిళ‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తూ త‌మ శ‌రీరంలోని వాటిని అమ్ముకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. వారు ఇచ్చే డబ్బులతో ఏడాది వరకు ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయని ఆ మ‌హిళ‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం చాలా మంది మహిళలది ఇదే పరిస్థితి ఉంది.

వేరే ఉద్యోగాలు చూసుకుందామంటే లేవు. ఉన్న వాటిలో తొల‌గింపులు.. జీతంలో కోత వంటి వాటితో రోజువారీ ఖ‌ర్చులు భ‌రించ‌లేక‌పోతున్నారు. కుటుంబ బాధ్యత‌లు త‌దిత‌ర వాటి కోసం వారు తప్పనిసరై గర్భాన్ని అద్దెకు ఇవ్వడం, అండాన్ని దానం చేయడం వంటి పనులు చేస్తున్నారు. వీటికి న‌ర్సింగ్ హోమ్‌లు.. ప్రైవేటు ఆస్ప‌త్రులు స‌హ‌క‌రిస్తున్నాయి.