Begin typing your search above and press return to search.

మహిళల విషయంలో తాలిబన్ల మరో అరాచకం

By:  Tupaki Desk   |   21 Dec 2022 12:30 PM GMT
మహిళల విషయంలో తాలిబన్ల మరో అరాచకం
X
తాలిబన్లు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అక్కడి మహిళలపై ఉక్కుపాదం మోపారు. ఈ నెల ప్రారంభంలో తమ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు రాయడానికి అనుమతించిన తాలిబాన్ తాజాగా మహిళలకు విశ్వవిద్యాలయ విద్యను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళల హక్కులకు వ్యతిరేకంగా మరో చర్యకు పాల్పడ్డారు. తాలిబాన్లు మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు విశ్వవిద్యాలయ విద్యను నిషేధించారు. అప్ఘన్ లకు ఇబ్బందులు లేని పాలన అందిస్తామని వాగ్దానం చేసినప్పటికీ తాలిబాన్లు మహిళల స్వేచ్ఛ , విద్యా హక్కును అణిచివేసేందుకు మరోసారి పూనుకున్నారు.

మంగళవారం దేశంలోని అన్ని ప్రభుత్వ.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు - ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహ్మద్ నదీమ్ సంతకంతో ఒక లేఖ జారీ చేయబడింది: "మహిళా విద్యను నిలిపివేసే ఉత్తర్వులను తదుపరి నోటీసు వచ్చేవరకు వెంటనే అమలు చేయాలని మీ అందరికీ తెలియజేయబడింది" అని విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు యూనివర్శిటీ ప్రవేశ పరీక్షలకు హాజరైన మూడు నెలల లోపే ఇలా జరగడం వారి కలలను చిదిమేసేలా తయారైంది.. విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం శీతాకాల విరామంలో ఉన్నాయి. మార్చిలో తిరిగి తెరవబడతాయి. మహిళా స్వేచ్ఛకు వ్యతిరేకంగా చేసిన చర్యలకు తాలిబాన్‌లు ప్రపంచవ్యాప్త ఆగ్రహాన్ని అందుకున్నారు.

అమెరికా మంగళవారం విశ్వవిద్యాలయాలలో మహిళలపై తాలిబాన్ నిషేధాన్ని విమర్శించింది. "ప్రతిచర్యల" గురించి హెచ్చరించింది. యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ ప్రెస్ బ్రీఫింగ్‌లో మాట్లాడుతూ "తాలిబాన్లు తమ స్వంత ప్రజలకు పదేపదే బహిరంగంగా చేసిన కట్టుబాట్లకు విరుద్ధమైన ఈ నిర్ణయం వారికి ఖచ్చితమైన పరిణామాలను కలిగిస్తుందని అమెరికా హెచ్చరించింది. ఇది అమెరికా మరియు మిగిలిన ప్రపంచంతో సంబంధాల మెరుగుదలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. దీనిని "ఆమోదించలేని వైఖరి"గా పేర్కొన్నారు. "ఇది తాలిబాన్‌లకు గణనీయమైన పరిణామాలను కలిగిస్తుంది. తాలిబాన్‌ను అంతర్జాతీయ సమాజం నుండి మరింత దూరం చేస్తుంది. వారు కోరుకునే చట్టబద్ధతను నిరాకరిస్తుంది" అని ప్రైస్ అన్నారు.

ఇదిలావుండగా నిషేధం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. "విద్యా నిరాకరణ మహిళలు ,బాలికల సమాన హక్కులను ఉల్లంఘించడమే కాకుండా దేశ భవిష్యత్తుపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని సెక్రటరీ జనరల్ పునరుద్ఘాటించారు.

ముఖ్యంగా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అనేక కఠినమైన చర్యలకు పాల్పడింది. ముఖ్యంగా మహిళలు , మైనారిటీల హక్కులకు సంబంధించి లింగ-విభజన చేసింది. తరగతి గదులు , ప్రవేశాలకు సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేయాలని అన్ని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. టీవీ ఛానెల్‌లలోని మహిళా ప్రజెంటర్లందరినీ మానేయాలని ఆదేశించింది. వారి ముఖాలను కప్పుకొని వార్తలు చదవాలని ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో, భార్యాభర్తలు అయినప్పటికీ, రెస్టారెంట్లలో పురుషులు మరియు మహిళలు కలిసి కూర్చోవడానికి అనుమతి లేదని కఠిన చట్టాలు అమలుచేశారు. ఇప్పుడు మహిళలకు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాన్ని నిరాకరించి షాకిచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.