Begin typing your search above and press return to search.

అభయ్‌ అంటూ మగవారికి ఒక చట్టం!

By:  Tupaki Desk   |   21 Sep 2015 4:09 AM GMT
అభయ్‌ అంటూ మగవారికి ఒక చట్టం!
X
ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరిగితే వారిని కాపాడడానికి లేదా వారికి న్యాయం జరిగేలా చూడడానికి మన దేశంలో బోలెడు చట్టాలున్నాయి. ఇటీవలే నిర్భయ చట్టం కూడా వచ్చింది. అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే.. వాటిని నిర్భయ కేసుల, అభయ కేసు అంటూ పోలీసులు ఎడపెడా కొత్త చట్టం కింద కేసులు పెట్టేస్తున్నారు. అంతా చాలా పక్కాగా జరుగుతోంది. మరి అబ్బాయిల మీద అత్యాచారాలు జరిగితే, వారు అన్యాయానికి గురైతే, వారు దాష్టీకానికి గురైతే పరిస్థితి ఏంటి? వారిని ఆదుకునే వ్యవస్థ మనదగ్గర ఉన్నదా? వారికి న్యాయం చేసే చట్టాలు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. అదే సమయంలో అలాంటి అమాయక లేదా అభాగ్యులయిన పురుషపుంగవుల కోసం కొత్త చట్టాలు అవసరమా అంటే అవుననే చెప్పాలి. అన్యాయానికి గురయ్యే అబ్బాయిల కోసం .. 'అభయ్‌' వంటి చట్టాలు అవసరం అని చెప్పే సంఘటన ఇది.

అభాగ్యుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం జరిగిందిదీ..

కర్ణాటక బెళగావి జిల్లాలోని రాయబాగ్‌ లో నారాయణప్ప అనే నిర్భాగ్యుడు ఒక ప్రెవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడి ఖర్మ కాలి.. అదే ఆఫీసులో పనిచేసే ప్రతిభ అనే అమ్మాయి అతడిని ఇష్టపడింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. తనకు కుదరదని నారాయణప్ప తేల్చిచెప్పాడు. తానుగా వెళ్లి అడిగితే తిరస్కరించాడనే కోపం వచ్చిందో, లేదా, అతడిని పెళ్లి చేసుకోవాలనే ప్రేమ పిచ్చి హెచ్చిపోయిందో తెలియదు గానీ.. మొత్తానికి ప్రతిభ.. తనను పెళ్లి చేసుకోకుంటే చంపుతానంటూ బెదిరించింది. అయినా అతను పట్టించుకోలేదు. దీంతో ఆమె ప్లాన్‌ మార్చి, తన ఫ్రెండ్స్‌ ఇద్దరి సహాయం తీసుకుని నారాయణప్పను కిడ్నాప్‌ చేసింది. జోడప్ప అనే పల్లెలోని ఒక ఆలయంలో బలవంతంగా తాళి కట్టించుకుంది. దానిని వీడియో తీయించి.. తనే మోసం చేశావంటూ ఎదురు కేసు పెడతానని బ్లాక్‌ మెయిలింగ్‌ చేసింది. నారాయణప్ప దిక్కుతోచక.. పోలీసుల్ని ఆశ్రయించాడుట.

ఇంతకూ నారాయణప్ప అంతా నిజమే చెబుతున్నాడా లేదా అనేది పోలీసులు విచారించాల్సి ఉంది. అంతా నిజమే అయి అతను అన్యాయానికి గురైనట్లే తేలితే.. ఇక.. ఈ దేశంలో 'అభయ్‌' చట్టం లాంటివి కూడా రావాల్సిన అవసరం తప్పదని పలువురు జోకులేస్తున్నారు.