Begin typing your search above and press return to search.

మద్యం విక్రయాల్లో చిత్ర విచిత్ర సన్నివేశాలు..అమ్మాయిలు కూడా క్యూలో

By:  Tupaki Desk   |   4 May 2020 7:45 PM IST
మద్యం విక్రయాల్లో చిత్ర విచిత్ర సన్నివేశాలు..అమ్మాయిలు కూడా క్యూలో
X
కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన స‌డ‌లింపులతో దేశంలో మ‌ద్యం విక్ర‌యాలు ప్రారంభమ‌య్యాయి. అయితే మ‌ద్యం అంశం (ఎక్సైజ్ శాఖ‌) అంశం రాష్ట్ర ప‌రిధిలోని అంశం కాబ‌ట్టి కొన్ని రాష్ట్రాలు మ‌ద్యం విక్ర‌యాల‌కు మొగ్గు చూప‌గా మ‌రికొన్ని రాష్ట్రాలు మ‌ద్యం విక్ర‌యాలు చేయాల్న వ‌ద్దా అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. చాలా రాష్ట్రాలో మ‌ద్యం విక్ర‌యాలు ప్రారంభ‌మ‌య్యాయి. దాదాపు 45 రోజుల పాటు మ‌ద్యానికి దూర‌మైన ప్ర‌జ‌లు మద్యం దుకాణాలు తెరవడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. దుకాణాలు తీయడానికి రెండు మూడు గంటల ముందే వరుసలో నిల్చున్నారు. కొందరైతే దుకాణాలకు పూజలు చేశారు. ఎండ తీవ్రంగా ఉన్నా ఖాతరు చేయకుండా కిలో మీటర్‌ మేర వరుసలో నిలబడ్డారు. చుక్క కోసం అష్టకష్టాలు పడ్డారు. మద్యం విక్రయాల సందర్భంగా చిత్రవిచిత్ర సన్నివేశాలు జరిగాయి. అయితే మద్యం అంటేనే పురుషులు గుర్తుకు వస్తారు. కానీ ఇప్పుడు మద్యం దుకాణాల వద్ద పురుషులతో పాటు స్త్రీలు, యువతలు వరుసలో నిలబడ్డారు.

మద్యం దుకాణాల వద్ద మహిళలు కూడా నిలబడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొందరు యువతులు ఏకంగా మద్యం దుకాణం ఎదుట నిలబడి మద్యం కొనుగోలుకు చాలాసేపు వేచి ఉన్నారు. ఈ పరిణామం అక్కడ ఉన్నవారు అవాక్కయ్యారు. ఇన్నాళ్లు చాటున తాగేవాళ్లు లాక్‌డౌన్‌ పుణ్యాన బహిర్గతమైందని పేర్కొంటున్నారు. అయితే మరికొందరు తమ భర్తలు, కుటుంసభ్యుల కోసం మద్యం తీసుకునేందుకు దుకాణాలకు వచ్చారు. కిలో మీటర్‌ మేర క్యూలు ఉండడంతో మహిళలు ఉంటే త్వరగా మందు లభిస్తుందనే ఆశతో వారి ఇంట్లోని మహిళలను రంగంలోకి దింపారు. దుకాణదారులు కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి వారికి త్వరగా మద్యం ఇచ్చి పంపించి వేస్తున్న ఘటనలు ఉన్నాయి. దీంతో చాలామంది తమ భార్యలు, పిల్లలను మద్యం దుకాణాలకు పంపించి త్వరగా మద్యం లభించేలా ప్లాన్‌ వేశారు.

ఇలాంటి దృశ్యాలు కర్నాటకలోని బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం సిరిపురంలో యువతులు ముఖాళకు స్కాఫ్‌లు కట్టుకుని మద్యం దుకాణాలకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. దీంతో మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. మద్యం ధరలు పెంచినా వాటిని పట్టించుకోకుండా ప్రజలు తండోపతండాలుగా మద్యం దుకాణాలకు తరలివచ్చారు. గంటల కొద్దీ వరుసలో నిలబడి మద్యం కొనుక్కొని వెళ్లారు. త్వరగా మద్యం లభించాలని కొందరు మహిళలను పంపగా, మరికొందరు దివ్యాంగులుగా నటించడం వంటివి చేశారు.