Begin typing your search above and press return to search.

నా త‌ల్లికి క‌రోనా సోక‌లేదు..అంద‌ర్నీ క‌న్నీరు పెట్టించిన కుమారుడు

By:  Tupaki Desk   |   15 April 2020 11:30 AM GMT
నా త‌ల్లికి క‌రోనా సోక‌లేదు..అంద‌ర్నీ క‌న్నీరు పెట్టించిన కుమారుడు
X
ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా ల‌క్ష‌ణాలు అంటే ఊపిరి పీల్చుకోవ‌డంలో ఇబ్బంది - జ‌లుబు - ద‌గ్గు - గొంతునొప్పి - జ్వ‌రం వంటి వాటిలో ఏ ల‌క్ష‌ణం ఉన్నా అంద‌రూ క‌రోనాగా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కాలం మార‌డంతో సీజ‌న‌ల్ వ్యాధులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే వాటిని గ‌మ‌నించకుండా ఆస్ప‌త్రికి ఆయా ల‌క్ష‌ణాల‌తో వెంట‌నే హైద‌రాబాద్‌ కు త‌ర‌లిస్తున్నారు. క‌రోనా అనుమానితుడిగా గుర్తిస్తూ పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఓ మ‌హిళ‌ను ఆ విధంగా అనుమానించి మంచిర్యాల నుంచి హైద‌రాబాద్‌ కు త‌ర‌లిస్తుండ‌గా ఆమె ఆస్ప‌త్రికి చేరే లోపు మృతిచెందింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ లోని ఆస్ప‌త్రి వారు ఆమె క‌రోనాతో మృతి చెంది ఉంటుంద‌ని భావించి అంబులెన్స్‌ కు రసాయనాలు పిచికారి చేసి - మృత దేహనికి డీశానిటైజేషన్‌ చేసి - ప్రత్యేక సంచిలో ప్యాక్‌ చేసి ఆమె కుమారుడికి అప్పగించారు.

అయితే అంద‌రూ ఆమె క‌రోనా మృతి చెందింద‌ని చెబుతుండ‌డంతో ఆమె కుమారుడు క‌న్నీరుమున్నీర‌య్యాడు. త‌న త‌ల్లి క‌రోనాతో మృతి చెంద‌లేద‌ని.. ఆ విధంగా దూరం చేయొద్ద‌ని కోరుతూ బోరున విల‌పించాడు. ఈ ఘ‌ట‌న హైదరాబాద్‌ లోని కింగ్‌ కోఠి ఆస్ప‌త్రి వద్ద చోటుచేసుకుంది. మా అమ్మకు కరోనా లేదు.. అంటూ ఆమె కుమారుడు రోదించిన తీరు అంద‌ర్నీ కంటతడి పెట్టించింది.

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌ కు చెందిన 62 ఏళ్ల ఓ మహిళ రెండు రోజుల కిందట అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె కుమారుడు మంచిర్యాలలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమె కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్లేట్‌ లెట్స్ కౌంట్ కూడా బాగా తగ్గినట్లు గుర్తించారు. అయితే వారు కరోనా లక్షణాలుగా అనుమానించి హైదరాబాద్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఆ స‌మ‌యంలోనే త‌న త‌ల్లికి కరోనా సోక‌లేదంటూ ఆమె కుమారుడు వైద్యుల‌కు చెప్పాడు. అయినా ఆ వైద్యులు ఎంతచెప్పినా వినిపించుకోకుండా హైద‌రాబాద్ త‌ర‌లించారు.

మంచిర్యాల నుంచి 108 అంబులెన్స్‌ లో ఏప్రిల్ 14 మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌ లోన కింగ్‌ కోఠి ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. ఆమెను వార్డులోకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తుండగానే ఆమె మృతిచెందింది. అయితే మృత‌దేహం బ‌య‌ట‌కు తీయ‌కుండా అంబులెన్స్‌ లోనే కొన్ని గంటల పాటు ఉంచారు. ఎందుకంటే ఆమె క‌రోనాతో మృతి చెంది ఉంటుంద‌ని అనుమానించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంబులెన్స్‌ కు రసాయనాలు పిచికారి చేసి - మృతదేహనికి డీశానిటైజేషన్‌ చేసి - ప్రత్యేక సంచిలో ప్యాక్‌ చేసి ఆమె కుమారుడికి అప్పగించారు. ఈ క్ర‌మంలో కింగ్‌ కోఠి ఆస్ప‌త్రి వైద్యులు మృతురాలి నమూనాలను క‌రోనా పరీక్షల నిమిత్తం న‌మూనాలు సేక‌రించి ల్యాబ్‌ కు పంపించారు. ఈ ఘ‌ట‌న‌తో మ‌న‌స్తాపం చెందిన కుమారుడు తల్లికి ప‌ట్టిన అవ‌స్థ‌ను చూసీ తీవ్ర ఆవేద‌నతో క‌న్నీరుమున్నీర‌య్యాడు. మా అమ్మకు కరోనా లేదు.. మంచిర్యాలలో వైద్యులకు క‌రోనా లేద‌ని చెప్పినా వినకుండా పంపించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. చివ‌ర‌కు త‌ల్లి మృత‌దేహాన్ని అంబులెన్స్‌ లో స్వ‌గ్రామానికి తీసుకెళ్లాడు.