Begin typing your search above and press return to search.

ఆమె సైకిల్ అమరావతికి బయలుదేరింది..

By:  Tupaki Desk   |   24 Jun 2016 7:03 AM GMT
ఆమె సైకిల్ అమరావతికి బయలుదేరింది..
X
నవ్యాంధ్ర నూతన రాజధానికి వచ్చి తీరాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు... సౌకర్యాలు లేకుండా రమ్మంటే ఎలా అంటూ ఉద్యోగులు చాలాకాలంగా సాగుతున్న ఈ వాదులాటకు ఎట్టకేలకు ఏదో రకంగా తెరపడి తరలింపు మొదలైంది. కొందరు ఇష్టంగా.. ఇంకొందరు అయిష్టంగా.. మరికొందరు కష్టంగా... మొత్తానికి ఏదోరకంగా పెట్టేబేడా సర్దుకుని అమరావతికి తరలిపోతున్నారు. హైదరాబాద్ ను వీడలేక.. ఉద్యోగాన్ని వదులుకోలేక తప్పనిపరిస్థితుల్లో తరలి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి వెళ్లేందుకు ఎందుకంత కష్టం అంటూ, పదండి ముందుకు.. పదండి తోసుకు.. పోదాపోదాం అమరావతికి అంటూ స్ఫూర్తి రగిలించేలా ఓ మహిళా ఉద్యోగిని సైకిల్ పై అమరావతికి పయనమయ్యారు. చంద్రబాబు పెట్టిన 27వ తేదీ డెడ్ లైనుకు ముందుగానే 26 రాత్రికి అక్కడకు చేరుకునే తన సైకిల్ యాత్ర ప్రారంభించారు.

హైదరాబాద్‌ నుంచి ఏపీ రాజధాని అమరావతికి సైకిల్‌పై సాహసోపేతమైన ప్రయాణానికి పూనుకుంది ఓ ఉద్యోగిని. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీటీవోగా పనిచేస్తున్న ఏపీ ఉద్యోగి పద్మను విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించారు. ఈ నేపథ్యంలో సైకిల్‌ పై వెళ్లి ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో ఆమె సైకిల్ యాత్రకు ఉపక్రమించింది. కొద్దిసేపటి క్రితం ఆమె సైకిల్‌ యాత్రకు ఏపీ ఎన్‌ జీఓ నేత అశోక్‌ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 26 రాత్రికి విజయవాడ చేరుకునేలా ఆమె తన సైకిల్ టూర్ ను ప్లాన్ చేసుకున్నారు.

కాగా సైక్లింగులో కొంత అనుభవం ఉన్న ఆమె సుమారు 300 కిలోమీటర్ల దూరాన్ని ఇలా చేరుకోనుండడంపై ఉద్యోగవర్గాల్లో ఆసక్తి పెంచింది. తామంతా వెళ్లడానికే ఆలోచిస్తున్న తరుణంలో ఆమె సైకిల్ పై బయలు దేరి తమలో స్ఫూర్తి రగిలించిందని పలువురు ఉద్యోగులు అంటున్నారు.