Begin typing your search above and press return to search.

కేసీఆర్ చీర‌లు ఇస్తే..వాళ్లు త‌గ‌ల‌బెట్టేశారు

By:  Tupaki Desk   |   18 Sept 2017 2:30 PM IST
కేసీఆర్ చీర‌లు ఇస్తే..వాళ్లు త‌గ‌ల‌బెట్టేశారు
X
తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉదాత్త‌మైన ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్న ఉదంతాల్లో ఆయ‌న‌కే ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. నిన్న‌టికి నిన్న కేసీఆర్ స్వ‌యంగా నాటిన మొక్క వాడిపోయింద‌నే వార్త అంద‌రినీ అవాక్క‌య్యేలా చేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్టాత్మ‌కంగా హ‌రిత‌హారం చేప‌డితే అధికారులు - ప‌రిస్థితుల కార‌ణంగా ఆ మొక్క వాడిపోయింద‌ని ప‌లువురు కామెంట్లు చేశారు. ఇప్పుడు అదే రీతిలో స‌మ‌న్వ‌యం లోప‌మో....దురదృష్ట‌క‌ర‌మో..ఉద్దేశ‌పూర్వ‌క‌మో కానీ...తెలంగాణ స‌ర్కారుకు మాత్రం ప‌రాభ‌వం వంటి ప‌రిస్థితే ఎదురైంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా పంపిణీ చేసిన చీర‌ల‌ను ప‌లువురు మ‌హిళ‌లు త‌గ‌ల‌బెట్టేశారు.

ద‌స‌ర పండుగ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టింది. అయితే మొదటి రోజునే షాక్ త‌గిలే ప‌రిణామం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా చల్‌ గల్‌ - లింగంపేట్‌ గ్రామంలో వివాదస్పదమైంది. రూ.100 - 200విలువ చేసే నాసిరకం చీరలను అందించి అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకుంటున్నారని, తమకు చేనేత చీరలు కావాలని ఆందోళన చేపట్టారు స్థానిక మ‌హిళ‌లు. చౌరస్తాలో ప్రభుత్వం అందించిన నాసిరకం చీరలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ఈ ప‌రిణామం అంద‌రినీ షాక్‌ కు గురిచేసింది. మ‌రోవైపు తెలంగాణ వ్యాప్తంగా చీర‌ల పంపిణీ కోల‌హాలంగా సాగింది. తెల్ల‌రేష‌న్ కార్డున్న వారంతా రేష‌న్ కేంద్రాలు - ఇత‌ర పంపిణీ కేంద్రాల ద్వారా చీర‌ల‌ను పొందారు.

మూడునెలల క్రితం ప్రగతిభవన్‌ లో నేతన్నలతో సమావేశమైన సీఎం కేసీఆర్ వారి కష్టాలు తెలుసుకున్నారు. కనీసం నెలకు రూ.15వేలు ఉపాధి దొరికేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని నేతన్నలకు హామీఇచ్చారు. ఈ బాధ్యతను జౌళి - చేనేత శాఖ మంత్రి కేటీఆర్‌ కు అప్పగించారు. రంజాన్ - క్రిస్మస్ పండుగలకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం బతుకమ్మ పండుగకు కూడా అర్హులకు చీరెలు ఇవ్వాలని, దీనివల్ల నేతన్నలకు ప్రయోజనం కలుగాలని భావించింది. తెల్లరేషన్ కార్డులున్న ప్రతి ఆడబిడ్డకు చీరలు పంపిణీ చేయాలని - వీటిని నేతన్నలతో తయారుచేయించాలని నిర్ణయించింది.  దీనికోసం రూ.222 కోట్ల ఖర్చుతో 1.04 కోట్లు చీరెలను సిద్ధం చేసింది. చీరెల తయారీకి అవసరమయ్యే ఏడు కోట్ల మీటర్ల వస్త్రాలను ప్రభుత్వం తయారు చేయించింది. ఈ మొత్తం చీరెల్లో సగానికిపైగా రాష్ట్రం నుంచే సేకరించింది. రాష్ట్రంలోని మరమగ్గాల్లో అత్యధిక శాతం ఉన్న సిరిసిల్లలోనే 52 లక్షల చీరెలు తయ్యారయ్యాయి. రెండునెలలపాటు రాష్ట్రంలోని అన్ని మరమగ్గాలు పూర్తి ఉత్పాదక సామర్థ్యంతో పనిచేసినప్పటికీ సగం చీరెలు మాత్రమే సిద్ధమయ్యాయి. దీంతో జాతీయస్థాయి టెండర్ ప్రక్రియ ద్వారా మిగిలిన చీరలను సేకరించారు. అయితే ఈ చీరెలలో నాణ్య‌త లేద‌ని ప‌లువురు వాటిని త‌గ‌ల‌బెట్టేశారు.