Begin typing your search above and press return to search.

బాబూ..ఇదేనా మ‌హిళ‌ల‌కు మీరిచ్చే గౌర‌వం?

By:  Tupaki Desk   |   27 Nov 2018 12:17 PM IST
బాబూ..ఇదేనా మ‌హిళ‌ల‌కు మీరిచ్చే గౌర‌వం?
X
మధ్యాహ్న భోజన పథకం నిర్వాహక మహిళల ప‌ట్ల సీఎం నారా చంద్ర‌బాబు నాయుడి నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌హిళ‌ల ఉపాధిని ప్ర‌భుత్వం లాగేసుకొని.. వారిని వీధిన ప‌డేసిందంటూ విశ్లేష‌కులు మండిప‌డుతున్నారు.

పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని అందించే ప‌నిని చాలా ఏళ్లుగా స్థానిక క‌మిటీలే చూసుకుంటున్నాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఈ విధానాన్ని స‌వ‌రించింది. స్థానికుల‌ను కాద‌ని ‘నవ ప్రయాస్‌’ అనే ప్రైవేటు సంస్థకు ఆ కాంట్రాక్టును అప్ప‌గించింది. దీంతో ఇన్నాళ్లూ ఉపాధి పొందిన మ‌హిళ‌లు రోడ్డున ప‌డాల్సి వ‌చ్చింది.

ప్ర‌భుత్వం చ‌ర్య‌ను నిర‌సిస్తూ విశాఖపట్నం జిల్లా చోడవరంలో సోమవారం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహక మహిళలు భారీగా రోడ్డెక్కారు. ఏళ్ల త‌ర‌బ‌డి ప‌నిచేస్తున్న త‌మ‌ను కాద‌ని ప్రైవేటు వ్య‌క్తుల‌కు కాంట్రాక్టు అప్ప‌గించ‌డ‌మేంట‌ని నిల‌దీశారు. చోడవరం సమీపంలోని నవ ప్రయాస్‌ సంస్థ వంటశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు.

దీంతో అక్క‌డికి భారీగా చేరుకున్న పోలీసులు మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా ఆందోళ‌న‌కారుల‌పై విరుచుకుప‌డ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ - దౌర్జన్యంగా వారిని ఈడ్చుకెళ్లారు. అరెస్టు చేశారు. చోడవరం పరిసర ప్రాంతాల్లోని వివిధ పోలీసు స్టేషన్లకు వారిని తరలించారు. పోలీసుల జులుం కార‌ణంగా ప‌లువురు మ‌హిళ‌లు గాయ‌ప‌డ్డారు. కొంద‌రు స్పృహ కోల్పోయారు. గాయపడిన వారిని చోడవరం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 100 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. చివ‌ర‌కు 16 మంది మిన‌హా మిగ‌తా వారిని విడుద‌ల చేశారు.

ఉపాధి కోల్పోయిన మ‌హిళ‌ల ఆవేద‌న‌ను అర్థం చేసుకోకుండా పోలీసులు విచక్ష‌ణార‌హితంగా ప్ర‌వ‌ర్తించారంంటూ విశ్లేష‌కులు మండిప‌డుతున్నారు. మ‌హిళ‌ల ఆత్మ గౌర‌వంపై నిరంత‌రం నీతులు వ‌ల్లించే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ‌లో మాత్రం ఆ నీతుల‌కు చాలా దూరంగా ఉంటోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ ప్రైవేటు సంస్థ ప్ర‌యోజ‌నాల కోసం వేలాది మంది మ‌హిళ‌ల ఉపాధిని ప్ర‌భుత్వం లాగేసుకుంద‌ని ఆరోపించారు.