Begin typing your search above and press return to search.

ఐపీసీ-377 ర‌ద్దు ఎఫెక్ట్ షురూ..

By:  Tupaki Desk   |   2 Oct 2018 8:33 AM GMT
ఐపీసీ-377 ర‌ద్దు ఎఫెక్ట్ షురూ..
X
స్వ‌లింగ సంప‌ర్కం నేర‌మేమీ కాదంటూ దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఇటీవ‌లే తీర్పు చెప్పింది. ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌ లో స్వ‌లింగ సంప‌ర్కాన్ని వ్య‌తిరేకిస్తున్న సెక్ష‌న్‌-377ను ర‌ద్దు చేసింది కూడా. ఈ ర‌ద్దు ప్ర‌భావం క్ర‌మంగా క‌నిపిస్తోంది. దేశ రాజ‌ధాని ఢిల్లోలో చోటుచేసుకున్న ఓ ప‌రిణామ‌మే ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌.

రాజ‌స్థాన్‌ కు చెందిన ఇద్ద‌రు యువ‌తులు. వారిలో ఒక‌రి వ‌య‌సు 20 - మ‌రొక‌రి వ‌య‌సు 21. చిన్న‌ప్పుడు ఇద్ద‌రూ ఒకే పాఠ‌శాల‌లో చ‌దువుకున్నారు. అప్ప‌డే స్నేహితుల‌య్యారు. పెద్ద‌య్యే కొద్దీ స్నేహం బ‌ల‌ప‌డింది. ఎక్క‌డికెళ్లినా క‌లిసే వెళ్లేవారు. క‌లిసే తిరిగేవారు. అయితే, దాదాపు ఏడాదిన్న‌ర‌గా ఆ ఇద్ద‌రి మ‌ధ్య బంధం కొత్త పుంత‌లు తొక్కింది. మాన‌సిక బంధ‌మే కాకుండా శారీర‌క సంబంధ‌మూ మొద‌లైంది. తాము ఒక‌రి కోసం ఒక‌రం జ‌న్మించిన‌ట్లు నిర్ధారించుకున్నారు. ఇక‌పై క‌లిసే జీవించాల‌ని - పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

స‌హ‌జ‌త్వానికి దూరంగా ఉన్న వారి ప్రేమ‌ను ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌లేదు. ఇద్ద‌ర్నీ విడ‌దీసేందుకు ప్ర‌య‌త్నించారు. ఓ యువ‌తికి బ‌ల‌వంతంగా వేరే వ్య‌క్తి(పురుషుడు)తో రెండు నెల‌ల క్రితం నిశ్చితార్థం కూడా జ‌రిపించారు. డిసెంబ‌రులో పెళ్లి చేయాల‌ని నిశ్చ‌యించారు. దీంతో త‌మ ప్రేమ‌ను కుటుంబ పెద్ద‌లు అర్థం చేసుకోలేర‌ని యువ‌తులు భావించారు. అక్క‌డే ఉంటే త‌మ‌ను విడ‌దీయ‌డం ఖాయ‌మ‌ని నిర్ధారించుకున్నారు. ఇంట్లో చెప్ప‌కుండా పారిపోయారు. ఢిల్లీ చేరుకున్నారు. అయితే, కుటుంబ స‌భ్యులు వారిని విడిచిపెట్ట‌లేదు. ముమ్మ‌రంగా గాలించి వారి జాడ గుర్తించారు. ఇళ్ల‌కు తిరిగి రావాల‌ని బెదిరించారు.

విడిపోయేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఆ ప్రేమ జంట‌.. చివ‌ర‌కు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. కుటుంబ స‌భ్యుల నుంచి త‌మ‌కు ప్రాణ హాని పొంచి ఉందంటూ మొరపెట్టుకుంది. దీంతో విచార‌ణ నిర్వ‌హించిన న్యాయ‌స్థానం.. స్వ‌లింగ సంప‌ర్కం నేరం కాదంటూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు క‌ట్టుబ‌డింది. యువ‌తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. వారి త‌ల్లిదండ్రుల‌కు కౌన్సిలింగ్ ఇవ్వాల‌ని సూచించింది. దేశ రాజ‌ధానిలో చోటుచేసుకున్న ఈ ప‌రిణామం ఆరంభం మాత్ర‌మేన‌ని.. సుప్రీం తీర్పు నేప‌థ్యంలో రానున్న కాలంలో ఇలాంటి మ‌రిన్ని ఘ‌ట‌న‌లు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.