Begin typing your search above and press return to search.

సుప్రీం అయ్య‌ప్ప తీర్పుపై..మ‌హిళ‌ల భారీ నిర‌స‌న

By:  Tupaki Desk   |   3 Oct 2018 10:39 AM IST
సుప్రీం అయ్య‌ప్ప తీర్పుపై..మ‌హిళ‌ల భారీ నిర‌స‌న
X
గ‌డిచిన వారంలో దేశ అత్యున్న‌త న్యాయ‌స్థాన‌మైన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కే కాదు.. పెద్ద ఎత్తున వాద‌న‌ల‌కు.. ప్ర‌తివాద‌న‌ల‌కు తెర తీసింది. ఇక‌.. ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన శ‌బ‌రిమ‌ల‌లో 10-50 ఏళ్ల మ‌ధ్య మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌యంలో ద‌ర్శ‌నం చేసుకోవ‌టానికి అనుమ‌తిస్తూ తీర్పును ఇవ్వ‌టం తెలిసిందే. దీనిపై భారీ ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

శ‌బ‌రిమ‌ల‌కు ద‌గ్గ‌ర్లో ఉండే చిన్న ప‌ట్ట‌ణం పంద‌ళం. శ‌బరిమ‌ల ఆల‌యానికి పంద‌ళానికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. మ‌క‌ర‌జ్యోతి స‌మ‌యంలో స్వామివారి న‌గ‌ల‌ను ఊరేగింపుగా శ‌బ‌రిమ‌ల‌కు తీసుకెళ‌తారు. అలాంటి పుణ్య‌క్షేత్ర‌మైన పంద‌ళంలో తాజాగా చోటు చేసుకున్న నిర‌స‌న ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఎలాంటి రాజ‌కీయ ప్రోద్బ‌లం లేకుండా మ‌హిళ‌లు ఎవ‌రికి వారుగా పెద్ద ఎత్తున పాల్గొన‌టం.. కాసేప‌టికే ఇదో భారీ నిర‌స‌న‌గా మారి.. చుట్టుప‌క్క‌ల ఉన్న ఊళ్ల‌కు చెందిన వారు స్వ‌చ్చందంగా రోడ్ల మీద‌కు వ‌చ్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేనా.. తాము అయ్య‌ప్ప ద‌ర్శ‌నం కోసం యాభై ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కూ ఆగ‌గ‌ల‌మ‌ని.. మ‌హిళ‌లు ప‌లువురు ప్ల‌కార్డులు ప‌ట్టుకున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆల‌య సంప్ర‌దాయాల్ని.. సంస్కృతిని కారాసేలా నిర్ణ‌యాలు వ‌ద్ద‌ని.. ఆల‌య సంప్ర‌దాయాల‌ను నిర్దేశించేది భ‌క్తులేన‌ని వారు చెబుతున్నారు. రాజ్యాంగం కంటే శ‌తాబ్దాల ముందే ఆల‌య ఆచారాలు ఏర్ప‌డ్డాయ‌ని.. సంస్కృతిని ధ్వంసం చేయొద్ద‌ని వారు పేర్కొంటున్నారు.

సుప్రీం నిర్ణ‌యాన్ని తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకిస్తున్న‌ది వారిలో అత్య‌ధికులు మ‌హిళ‌లు.. యువ‌త ఉండ‌టం గ‌మ‌నార్హం. పంద‌ళంలో మంగ‌ళ‌వారం ఉద‌యం 4వేల మంది ఒక చోట‌కు చేరిన నిర‌స‌న షురూ చేశారు. పంద‌ళంలోని మెడిక‌ల్ మిష‌న్ జంక్ష‌న్ వ‌ద్ద ఉద‌యం 9.30 గంట‌ల మొద‌లైన ఈ నిర‌స‌న మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యానికి 40వేల‌కు చేరింది. మ‌రో రెండు గంట‌ల‌కు 50వేల‌కు పైగా చేర‌ట‌మే కాదు.. ఊరు ఊరంతా వ‌చ్చి ఆ కూడ‌లి ద‌గ్గ‌ర‌కు చేరిపోయింది. అంతేనా.. చుట్టుప‌క్క‌ల గ్రామాల వారు ఈ నిర‌స‌న‌లో పాల్గొనేందుకు ఊళ్ల‌నుంచి ప్ర‌త్యేకంగా పంద‌ళానికి చేరుకోవ‌టం గ‌మ‌నార్హం.

నిర‌స‌న చేస్తున్న వీరంతా చెబుతున్న‌ది ఒక్క‌టే.. సుప్రీం నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని.. కేర‌ళ ప్ర‌భుత్వం ఈ తీర్పుపై రివ్యూ పిటీష‌న్ దాఖ‌లు చేయాల‌ని. తాజా నిర‌స‌న‌కు పంద‌ళం రాజ కుటుంబం నాయ‌క‌త్వం ఒక ఎత్తు అయితే.. ఈ నిర‌స‌న సంద‌ర్భంగా అయ్య‌ప్ప ధ‌ర్మ సేన పేరిట ఒక హిందూ కార్య‌క‌ర్త‌ల కార్యాచ‌ర‌ణ స‌మితి కూడా ఏర్పాటైంది. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ నిర‌స‌న‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పాల్గొన‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. హ‌రిహ‌త పుత్రుడు అయ్య‌ప్ప కంటే సుప్రీం తీర్పు ఏమీ గొప్ప కాద‌ని నినాదాలు చేసిన వారి కార‌ణంగా పంద‌ళంలోని వీధుల‌న్నీ అయ్య‌ప్ప నినాదాల‌తో మారుమోగాయి.

సుప్రీం తీర్పుపై నిర‌స‌న‌లు ఒక్క పంద‌ళానికి మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. కొల్లాం.. అల‌ప్పుళ‌.. కోచి.. పంబ‌.. ప‌ల‌క్కాడ్‌.. కేర‌ళ రాష్ట్ర రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలోనూ నిర‌స‌న‌కారులు రోడ్ల మీద‌కు వ‌చ్చిన రోడ్ల‌ను స్తంభింప‌చేశారు. తిరుప‌నంత‌పురంలో ఇడుక్కికి చెందిన ఒక మ‌హిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌టం ఆందోళ‌న‌ల్ని ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా చేసింది. దేశం మొత్తమ్మీదా క‌మ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కేర‌ళ‌లో సుప్రీం తీర్పు వామ‌ప‌క్ష మిత‌వాదులు.. వామ‌ప‌క్షాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ తీవ్ర‌మ‌వుతోంది. దీంతో.. రాష్ట్ర రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.