Begin typing your search above and press return to search.

గార్డెన్ సిటీలో ప్రతి డిసెంబరు31 రాత్రి అదే తీరట

By:  Tupaki Desk   |   3 Jan 2017 9:56 AM GMT
గార్డెన్ సిటీలో ప్రతి డిసెంబరు31 రాత్రి అదే తీరట
X
మర్యాదస్తుల నగరంగా పేరున్నబెంగళూరు కీర్తిప్రతిష్టలు ఒక్కసారిగా మసకబారిపోయాయి. అమ్మాయిలకు ఏ మాత్రం రక్షణ లేదన్న విషయం స్పష్టం కావటమే కాదు.. బెంగళూరు మగాళ్లు మరీ ఇంత మృగాళ్ల అన్న భావన కలిగే పరిస్థితి ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ డిసెంబరు 31వ తేదీ రాత్రి జరిగిన ఆరాచకాన్ని ఒక ప్రముఖ జాతీయ పత్రిక ప్రముఖంగా ప్రచురించటంతో.. దానికి తగ్గ ఫోటోల్ని ఆధారాల్ని చూపించటంతో ఈ వ్యవహారం జాతీయస్థాయిలో సంచలనంగా మారింది.

ఇంత దారుణ పరిస్థితి ఎదురైతే పోలీసులు ఏం చేస్తున్నట్లు? అసలు ఈ ఘటన ఎందుకిలా జరిగింది? అన్న తవ్వకాలు ఇప్పుడు ఎవరికి వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త విషయాలు తెర మీదకు వచ్చాయి. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న గార్డెన్ సిటీలో ఈ డిసెంబరు 31వ రాత్రి చోటు చేసుకున్న ఘటనలు లాంటివే ప్రతి ఏడాది డిసెంబరు 31 అర్థరాత్రి వేళ జరుగుతుంటాయని.. అది కామన్ అని.. అందుకే చాలామంది అమ్మాయిలు ఎంజీ రోడ్డు వైపు వెళ్లరన్న మాట వినిపిస్తోంది.

అయితే.. గతానికి భిన్నంగా ఈ ఏడాది ఆరాచక శక్తులు మరింత చెలరేగిపోయాయని.. ఒక్క అమ్మాయిని 20 మంది మగాళ్లు చుట్టుముట్టిన పరిస్థితి నెలకొందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం ఇట్టే తెలుస్తుందని చెబుతున్నారు. నిజానికి.. డిసెంబరు 31 రాత్రి జరిగే ఘటనల్నినిలువరించటానికి వీలుగా.. ఎంజీ రోడ్ లో భారీ ఎత్తున పోలీసుల్ని మొహరించినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే పెద్ద ఎత్తున అమ్మాయిలు.. తమకేం ఫర్లేదన్న ధీమాతో వచ్చారని.. కానీ వారికి చేదు అనుభవం ఎదురైందని చెబుతున్నారు. మగాళ్లు.. మృగాలుగా మారి.. కనిపించిన అమ్మాయిలపై ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వేళ.. చాలామంది అమ్మాయిలు భయంతో పరుగులు తీశారని.. ఈ క్రమంలో చాలామందికి గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. సమూహంగా వచ్చిన పడిన మగాళ్లను కంట్రోల్ చేయటం చేతకాక పోలీసులు చేష్టలుడిగి ఉండిపోయారన్న విమర్శ వినిపిస్తోంది. ప్రతి ఏటా డిసెంబరు 31వ రాత్రి ఇంత భారీగా దారుణం జరుగుతుంటే.. పోలీసులు చూస్తూ ఉండిపోయిన వైనం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటంపై లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఇలాంటి దుర్మార్గాలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/