Begin typing your search above and press return to search.

చట్టసభల్లో మగువ స్థానం దిగువనేనా?

By:  Tupaki Desk   |   8 March 2017 7:01 AM GMT
చట్టసభల్లో మగువ స్థానం దిగువనేనా?
X
అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్య కనిపిస్తున్నా చట్టసభల్లో ఇది ఏ స్థాయిలో ఉందని ప్రశ్నించుకుంటే ప్రపంచవ్యాప్తంగా అంతంతమాత్రంగానే ఉంది. భారతదేశం ఇందుకు మినహాయింపేమీ కాదు. రెండు దేశాల్లో మినహా ఇంకెక్కడా జాతీయ స్థాయిలో చట్టసభల్లో 50 శాతానికి మించి మహిళలున్న దాఖలాలు లేవు. మన దేశంలో అయితే మరీ తీసికట్టు. పార్లమెంటులో ఉన్న మహిళలు కేవలం 11.6 శాతం మాత్రమే. ప్రపంచ సగటులో ఇది సగం మాత్రమే. మహిళలపై ఎన్నో ఆంక్షలున్న పాకిస్థాన్‌ - బంగ్లాదేశ్‌ - అఫ్గానిస్థాన్‌ వంటి దేశాలు కూడా మనకంటే మెరుగ్గా ఉన్నాయి.

పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో 2016లో ఆసియాలో వెనుకబడి ఉన్న ఏకైక దేశం భారత్ ఒక్కటేనని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరడానికి, గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో సాధించిన పురోగతి వేగాన్ని అందుకోవడానికి మరిన్ని చర్యలతో పాటుగా బలమైన రాజకీయ చిత్తశుద్ధి అవసరమని ‘2016లో పార్లమెంటులో మహిళలు’ పేరిట ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) మంగళవారం విడుదల చేసిన ఓ నివేదిక పేర్కొంది.

మనదేశంలో లోక్‌సభకు ఎన్నికైనవారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పోటీ చేసే మహిళల శాతం మాత్రం ఎక్కువగానే ఉంది. 1957 నుంచి 2014 మధ్య మహిళా అభ్యర్థులు సుమారు 15 రెట్లు పెరగ్గా.. పురుష అభ్యర్థులు మాత్రం అయిదు రెట్లే పెరిగారు.

* ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎంపీలు 46048

* అందులో మహిళలు: 10526, అంటే 23 శాతం

* లోక్ సభలో మొత్తం 543 స్థానా లుండగా 64 మంది మహిళలున్నారు.

* రాజ్యసభలో మొత్తం సీట్లు 244.. అందులో మహిళలవి 27

ఎక్కువ శాతం మహిళా ఎంపీలున్న దేశాలు
---
ర్యాంకు దేశం శాతం
----------
1 రువాండా 63.8

2 బొలీవియా 53.1

3 క్యూబా 48.9

4 ఐస్ ల్యాండ్ 47.6

5 నికరాగువా 45.7

* 2014 లోక్‌ సభ ఎన్నికల్లో పోటీచేసిన మహిళలు: 668

* 2014 లోక్‌ సభ ఎన్నికల్లో పోటీచేసిన పురుషులు: 7,583

* 2014 ఎన్నికల్లో పురుషుల విజయ శాతం: 6.4

* మహిళల విజయ శాతం: 9.3

* గత అన్ని సభల్లోనూ మహిళల గెలుపు శాతమే ఎక్కువగా ఉంది.

శాసనసభల్లో..

* ఎక్కువ మహిళా శాసనసభ్యులున్న రాష్ట్రాలు: బిహార్‌ - రాజస్థాన్‌ - హరియాణా

* మహిళా ఎమ్మెల్యేలు లేని రాష్ట్రం: నాగాలాండ్‌

మహిళా ఎంపీల విషయంలో భారత్‌ స్థానం 145

ఎగువ సభలో అత్యధిక శాతం మహిళా ఎంపీలున్న దేశం బెల్జియం 50%

- గరుడ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/