Begin typing your search above and press return to search.

మహిళా ఎంపీల విషయంలో మనమెక్కడ?

By:  Tupaki Desk   |   8 March 2016 5:30 PM GMT
మహిళా ఎంపీల విషయంలో మనమెక్కడ?
X
- మహిళా ఎంపీల విషయంలో ఇండియా ప్లేస్ ప్రపంచంలో 103వ స్థానం

- ఆసియాలో 13వ స్థానం

- సార్క్ దేశాలు ఎనిమిదింట్లో ఇండియాది 5వ స్థానం

- బ్రిక్స్ దేశాలు అయిదింట్లో ఇండియాది 4వ స్థానం.

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం చాలా కాలంగా నలుగుతోంది. 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ తీర్మానం చేసింది. అయితే... దేశస్థాయిలో చూసుకున్నా మహిళా ఎంపీల సంఖ్య ఇప్పటికే తక్కువే. స్వతంత్ర భారతంలో తొలి పార్లమెంటుకు ఇప్పటికీ మహిళా సభ్యుల సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ పురుష సభ్యులతో పోల్చితే అది చాలా తక్కువ.

ప్రజలు ఎన్నుకునే సభ అయిన లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం గత 54 ఏళ్లలో కేవలం మూడు రెట్లు పెరిగింది. అయితే .. శాతం పరంగా చూస్తే మాత్రం ఇప్పటికీ వారి ప్రాతినిధ్యం చాలా తక్కువనే చెప్పాలి. మొట్టమొదటి లోక్ సభ(1951 )లో 22 మంది మహిళా ఎంపీలు ఎన్నిక కాగా ప్రస్తుత లోక్ సభకు 66 మంది ఎన్నికయ్యారు.

లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం ఇలా..
----------
సంవత్సరం మహిళా ఎంపీల సంఖ్య శాతం
---------

2014 66 12.15

2009 59 10.87

2004 45 8.29

1999 49 9.02

1998 43 7.92

1996 40 7.37

1991 39 7.30

1989 29 5.48

1984 43 7.95

1980 28 5.29

1977 19 3.51

1971 28 5.14

1967 29 5.58

1962 31 6.28

1957 22 4.45

1951 22 4.45

అయితే లోక్ సభకు పొటీ చేసే మహిళల శాతం మాత్రం భారీగా పెరిగింది. 1957 లో 45 మంది పోటీపడగా.. మొన్నటి ఎన్నికల్లో 668 మంది పోటీపడ్డారు. పురుష అభ్యర్ధుల విషయానికొస్తే 1957లో 1474 మంది పోటీ పడగా 2014లో 7583 మంది లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. 1957 నుంచి 2014 మధ్య మహిళా అభ్యర్ధులు సుమారు 15 శాతం పెరగ్గా .. పురుష అభ్యర్ధులు మాత్రం 5 రెట్లే పెరిగారు. అయితే.. పెరుగుదల ఏ స్ధాయిలో ఉన్నా కూడా 1957లో పోటీ చేసిన పురుషుల సంఖ్య కంటే కూడా 2014 లోక్ సభ బరిలో దిగిన మహిళ సంఖ్య సగం కూడా లేదు.

కాగా ఎన్నికల్లో గెలుపు శాతం మాత్రం మహిళలదే అధికంగా ఉంది. 1971 నాటి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన పురుషుల్లో 18 శాతం మంది గెలవగా.. మహిళల్లో 34 శాతం మంది ఎన్నికయ్యారు. ప్రస్తుత లోక్ సభలో పురుషుల విజయ శాతం 6.4 కాగా మహిళల విజయ శాతం 9.3 కానీ, విజయం సాధిస్తున్న మహిళల్లో ఎక్కవ మంది రాజకీయ కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు.

ప్రపంచ దేశాల్లో పరిస్థితి..

ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు కూడా మనది వెనుకబాటనే చెప్పాలి. ప్రపంచ దేశాల పార్లమెంటుల్లో మహిళా సభ్యుల సగటు 22.4 శాతం. 2014లో మన దేశంలో 12.5 శాతమే ప్రాతినిధ్యం ఉంది. మొత్తం 140 దేశాల లెక్కలు తీసుకుంటే ఇండియా 103వ స్థానంలో ఉంది. ఆసియాలోని 18 దేశాలతో పోల్చితే భారత్ 13వ స్థానంలో ఉంది. తీవ్ర అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సౌత్ సూడాన్ లో కూడా మన కంటే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువే.

- 50 శాతం, అంతకంటే ఎక్కువ మహిళా ఎంపీలు ఉన్న దేశాలు 3

- 40 శాతం కంటే ఎక్కువ మహిళా ఎంపీలు ఉన్న దేశాలు 13

- 30 శాతం అంతకంటే ఎక్కువ ఉన్న దేశాలు 42

- ఖతర్ - టోంగా తదితర అయిదు దేశాల్లో ఒక్క మహిళా ఎంపీ కూడా లేరు.

- ప్రపంచ దేశాలన్నిటిలోనూ రువాండా టాప్ లో ఉంది. అక్కడి నేషనల్ పార్లమెంటులో 63.8 శాతం మంది మహిళా ఎంపీలున్నారు.

- రువాండా తరువాత బొలీవియాలో అత్యధికంగా 53 శాతం మంది ఉన్నారు. ఆండోరాలో మహిళ - పురుష ఎంపీల సంఖ్య సమానంగా ఉంది.

- వెనుకబడిన దేశాలైన ఆఫ్రికా దేశాల్లోనే మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండడం విశేషం. ఆఫ్రికా తరువాత యూరప్ - దక్షిణ అమెరికాల్లో ఎక్కువగా ఉన్నారు.

- మహిళా ఎంపీల విషయంలో ప్రపంచ సగటు 22.4 శాతం కాగా యూరప్ సగటు అంతకంటే ఎక్కువగా ఉంది. యూరప్ దేశాల సగటు 25.2 శాతం కాగా ఆఫ్రికా దేశాల సగటు 22.6. ఆసియా దేశాల సగటు 19 శాతం మాత్రమే. అరబ్ దేశాల సగటు 18 శాతం.

- నేపాల్ - ఆఫ్ఘనిస్థాన్ - ఫిలిప్పీన్స్ - చైనా వంటి ఆసియా దేశాలన్నీ మన కంటే ముందున్నాయి. చివరకు పాకిస్థాన్ లో కూడా మనకంటే మహిళా ఎంపీల ప్రాతినిధ్యం ఎక్కువే.

మహిళా ఎంపీల శాతంలో టాప్ కంట్రీస్

1. రువాండా

2. బొలీవియా

3. ఆండోరా

4. క్యూబా

5. సీషెల్స్

6. స్వీడన్

7. సెనెగల్

8. ఫిన్లాండ్

9. ఈక్వడార్

10. దక్షిణ ఆఫ్రికా

11. నమీబియా

12. ఐస్ లాండ్

13. స్పెయిన్

కాగా లోక్ సభలో పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లోనూ ప్రాతినిధ్యం తక్కువే ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను తీసుకుంటే అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 9 శాతమే.

- బీహార్ - రాజస్థాన్ - హర్యానాల్లో 14 శాతం చొప్పున మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.

- పాండిచ్చేరి - నాగాలాండ్ లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు