Begin typing your search above and press return to search.

విరంచి ఆసుపత్రి దారుణం.. ఆ చెల్లెలు మాటల్ని వింటే వణుకే

By:  Tupaki Desk   |   29 May 2021 4:05 AM GMT
విరంచి ఆసుపత్రి దారుణం.. ఆ చెల్లెలు మాటల్ని వింటే వణుకే
X
కరోనా వేళ కాసుల కక్కుర్తితో రక్తం పిండేస్తున్న జలగల మాదిరి కార్పొరేట్.. ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని వ్యవహరిస్తున్న తీరు తెలిసిందే. భారీగా బిల్లులు బాదేయటం మామూలే అయినా.. అన్నేసి లక్షలు తీసుకున్న తర్వాతైనా సక్రమంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ఆయా ఆసుపత్రులపై ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది.

బంజారాహిల్స్ ప్రధాన రహదారి మీద కేర్ ఆసుపత్రి దాటి కాస్త ముందుకు వెళితే.. రాజసౌధాన్ని తలపించేలా ఒక భారీ భవనం కనిపిస్తుంది. భలేగా ఉందే ఈ భవనం అన్న భావన కలిగటం ఖాయం. అదే.. విరంచి ఆసుపత్రి. పేరులో కనిపించే కొత్తదనం.. భవనం భారీతనాన్ని చూసి భరోసాతో వెళ్లిన ఒక బాధితుడు (వంశీక్రిష్ణ) తాజాగా మరణించాడు. ఐసీయూలో చికిత్స పొందిన ఆ పేషెంట్ చెల్లెలు.. వైద్యం జరిగిన అన్ని రోజులు దగ్గరే ఉండి చూసుకుంది. ఆసుపత్రి ఆరాచకాల్ని ఎండగట్టటమే కాదు.. వైద్యం జరిగిన తీరును ఆమె వివరించిన తీరు చూస్తే.. ఆమె చదువుకున్నదే కాదు.. వైద్యం మీద అంతో ఇంతో అవగాహన ఉందన్న భావన కలుగుతుంది.

తన అన్న మరణించటంతో.. ఆమె.. ఆమె బంధువులు ఆసుపత్రిలో నిరసన చేపట్టారు. అలా చేయటం తప్పా? ఒప్పా? అన్నది మరో చర్చ. కానీ.. ఆసుపత్రిలో వైద్యులు అందించిన వైద్యం తీరును.. తన అన్న వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించిన వైనంపై బాధితుడి చెల్లెలు వివరించిన తీరు చూస్తే వణుకు పుట్టకమానదు. అంత పెద్ద ఆసుపత్రిలో అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని అవాక్కు కాక మానదు.

34 నిమిషాల సుదీర్ఘంగా ఉన్న ఈ వీడియోను మొత్తంగా చూడటానికిచాలానే ఓపిక కావాలి. కానీ.. 27వ నిమిషం నుంచి మరణించిన వ్యక్తి చెల్లెలు.. ఆసుపత్రిలో తన అన్నకు జరిగిన వైద్యం.. వైద్యుల నిర్లక్ష్యం గురించి ఆమె మాటలు వినాల్సిందే. మొత్తం ఏడు నిమిషాల నిడివిలో తన అన్నకు జరిగిన అన్యాయం గురించి ఆమె మాటలు వింటే.. ఆసుపత్రికి వైద్యానికి వెళ్లాలంటేనే భయం కలగటం ఖాయం.

ఈ ఆసుపత్రిపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. ఇకపై కొవిడ్ చికిత్స చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. మొదటి వేవ్ లోనూ..ఈ ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆ ఆసుపత్రిలో కొవిడ్ వైద్యానికి అనుమతులు రద్దు చేశారు. ఇప్పుడు రెండోసారి కావటం గమనార్హం. బాధితురాలి వేదనను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే..ఆమె మాటల్లో వింటే.. ఆసుపత్రిలో వైద్యం ఇలా చేశారా? అని ఆవాక్కు అవ్వాల్సిందే.