Begin typing your search above and press return to search.

ప‌రామ‌ర్శ‌కు వెళితే.. ప‌వ‌న్ ను నిల‌దీసింది!

By:  Tupaki Desk   |   19 May 2018 9:40 AM IST
ప‌రామ‌ర్శ‌కు వెళితే.. ప‌వ‌న్ ను నిల‌దీసింది!
X
ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాల‌న్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. ప్ర‌శ్నించ‌టం త‌ర్వాత‌.. ఆయ‌న్నే ప్ర‌శ్నించిందో మ‌హిళ‌. టీడీపీ.. బీజేపీలు త‌మ‌ను మోసం చేశాయంటూ ఆక్రోశం వ్య‌క్తం చేసిన స‌ద‌రు మ‌హిళ‌.. ఇప్పుడు మిమ్మ‌ల్ని ఎందుకు న‌మ్మాల‌ని ప్ర‌శ్నించింది. ఈ ఆస‌క్తిక‌ర ప‌రిణామం విశాఖ న‌గ‌ర ప‌రిధి లోని గంగ‌వ‌రం గ్రామంలో ప‌వ‌న్ కు ఎదురైంది.

సొంత అభిమానులు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్ ను ఉద్దేశించి సీఎం.. సీఎం అంటూ ఉత్సాహంగా అరుస్తూ.. నినాదాలు చేస్తున్న వేళ‌.. కిడ్నీ బాధిత మ‌హిళ మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా.. త‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ప‌వ‌న్ ను ఉద్దేశించి ప్ర‌శ్నించింది. ఇప్ప‌టికే త‌మ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తామంటూ న‌మ్మ‌బ‌లికి.. అధికారంలోకి వ‌చ్చిన వారంతా త‌మ‌ను మోసం చేశార‌ని.. మ‌రి.. మిమ్మ‌ల్ని ఎలా న‌మ్మాలంటూ ప‌వ‌న్ ను ప్ర‌శ్నించింది.

బాధిత మ‌హిళ ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ స్పందిస్తూ.. తాను కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకే వ‌చ్చాన‌ని.. మీ త‌ర‌పున పోరాడేందుకు తాను వ‌చ్చిన‌ట్లు చెప్పారు. మీరంతా ఐక్యంగా ఉంటే తాను స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన త‌ర్వాతే త‌న‌కు ఓటు వేయాల‌న్నారు. కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ను టీడీపీ.. బీజేపీలు మ‌ర్చిపోయినా.. తాను మాత్రం మ‌ర్చిపోలేదంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఎప్పుడూ లేని రీతిలో త‌న‌ను నేరుగా ప్ర‌శ్నించిన మ‌హిళ తీరు.. ప‌వ‌న్ ను ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేసింద‌ని చెప్పాలి.

మ‌రి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన త‌ర్వాత మాత్ర‌మే త‌న‌కు ఓటు వేయాలంటూ ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. గంగ‌వ‌రం గ్రామంలోని ప్ర‌జ‌లు కిడ్నీ.. చ‌ర్మ వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న‌ట్లుగా తెలిసి తాను వ‌చ్చిన‌ట్లుగా ప‌వ‌న్ చెప్పారు. ఎన్నిక‌ల్లోపు వారి స‌మ‌స్యను ప‌రిష్క‌రించ‌టం అంత సులువైన ప‌ని కాదు. మ‌రి.. తాను స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించిన త‌ర్వాతే ఓట్లు వేయాల‌ని కోర‌ట‌మంటే.. దాని అర్థం ఏమిటి? అన్న ప్ర‌శ్న ఇప్పుడు ప‌లువురి మ‌దిని తొలిచేస్తోంది. మ‌రి.. ప‌వ‌న్ ఐడియా ఏమిటో ఆయ‌నే క్లారిటీ ఇస్తే స‌రిపోతుందేమో?