Begin typing your search above and press return to search.

లేడీ ఎంపీలు పెరుగుతున్నారే... ఈ సారి 78 మంది

By:  Tupaki Desk   |   25 May 2019 1:30 AM GMT
లేడీ ఎంపీలు పెరుగుతున్నారే... ఈ సారి 78 మంది
X
చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగుపెడుతుప‌న్న మ‌హిళ‌ల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇటీవ‌ల రాజ‌కీయాల్లోకి చాలా ఉత్సాహంగానే వ‌చ్చేస్తున్న మ‌హిళ‌లు... స‌త్తా చాటుతున్నారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతున్న వారి సంఖ్యే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. నిన్న‌టితో ముగిసిన ఈ సార్వ‌త్రి ఎన్నిక‌ల్లో ఏకంగా 78 మంది మ‌హిళ‌లు కొత్త స‌భ‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. వీరిలో కొత్త లేడీ ఎంపీల సంఖ్య 27గా ఉండ‌టం మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. ఈ దఫా లోక్ స‌భ బ‌రిలో నిలిచిన మ‌హిళా నేత‌ల సంఖ్య కూడా అమాంతంగానే పెరిగింది.

పురుషుల‌కు ఏమాత్రం తగ్గ‌ని రీతిలో ప్ర‌త్య‌క్ష పోరుకు ఆస‌క్తి చూపిస్తున్న మ‌హిళ‌లు... ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌మ‌దైన శైలిలో దూసుకెళుతూ స‌త్తా చాటుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అమేథీలో మ‌ట్టిక‌రిపించిన బీజేపీ స్టార్ మ‌హిళ స్మృతి ఇరానీ... స‌త్తా క‌లిగిన మ‌హిళ‌ల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. ఇక ఈ సారి స‌భ‌లో అడుగుపెడుతున్న మ‌హిళ శాతం 14 శాతానికి చేరింది. తొలి స‌భ నుంచి అంటే... 1952 నుంచి కూడా ప్ర‌తి స‌భ‌కూ మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతూనే వ‌స్తోంది.

మొదటి, రెండో లోక్‌ సభలో 24 మంది చొప్పున మహిళలు ఎన్నిక కాగా.. మూడో లోక్‌ సభలో 37మంది అడుగుపెట్టారు. ఎనిమిదో లోక్‌ సభ 45 - తొమ్మిదిలో 28 - 10వ లోక్‌ సభలో 42 మంది మహిళలు చట్టసభకు ఎన్నికయ్యారు. 11వ లోక్‌ సభలో 41 - 12లో 44 - 13లో 52 - 14వ లోక్‌ సభలో 52 మంది మహిళలు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. 15వ లోక్‌ సభలో 52 - 16వ లోక్‌ సభలో 64 మంది మహిళా ఎంపీలు తమ వాణి వినిపించారు. ఈ స‌భ‌కు ఈ సంఖ్య 78కి చేరిపోయింది. వీరిలో 27 మంది కొత్త నేత‌లు కాగా... సిట్టింగ్ ల‌లో యూపీఏ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, బీజేపీ నేత‌లు హేమమాలిని - కిరణ్ ఖేర్ - రీటా బహుగుణ - డీఎంకే నేత కనిమొళి - బెంగాల్‌ కు చెందిన లాకెట్ చటర్జీ త‌దిత‌రులు త‌మ స్థానాల‌ను తిరిగి నిలబెట్టుకున్నారు.

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 724 మంది మహిళలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 54 మంది బరిలో నిలవగా.. బీజేపీ 53 మందికి టికెట్లు ఇచ్చింది. బీఎస్పీ 24 - తృణమూల్ కాంగ్రెస్ 23 - సీపీఎం 10 - సీపీఐ 4 - ఎన్సీపీ నుంచి ఒక మహిళ పోటీ చేశారు. 222 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. యూపీలో అత్యధికంగా 104 మంది - తమిళనాడులో 64 - బీహార్‌ లో 55 - బెంగాల్‌ లో 54మంది మహిళలు పోటీ చేశారు.