Begin typing your search above and press return to search.

మ‌ద్యం నిర‌స‌న‌లు బాల‌య్య‌కూ తాకాయే!

By:  Tupaki Desk   |   9 July 2017 4:27 AM GMT
మ‌ద్యం నిర‌స‌న‌లు బాల‌య్య‌కూ తాకాయే!
X
న‌వ్యాంధ్ర‌ల్లో మ‌ద్యం షాపుల ఏర్పాటుపై గ‌త వారం రోజులుగా కొన‌సాగుతున్న నిర‌స‌న‌లు - ఆందోళ‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. జాతీయ ర‌హ‌దారుల‌కు స‌మీపంలో మ‌ద్యం షాపులు వ‌ద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు - ఆ త‌ర్వాత చంద్ర‌బాబు స‌ర్కారు నూత‌న మ‌ద్యం పాల‌సీని తీసుకొచ్చిన ద‌రిమిలా... ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్క‌రిస్తే... ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యంలో మ‌ద్యం వ్యాపారులు త‌మ వైన్ షాపులు - బార్లు - రెస్టారెంట్ల‌ను జ‌నావాసాల్లోకి త‌ర‌లించేందుకు య‌త్నించారు. రోడ్ల‌పై మ‌ద్యం షాపులుంటేనే ఇబ్బందులు త‌ప్ప‌డం లేదంటే... ఇక జ‌నావాసాల్లోకి వ‌చ్చేస్తే తామెలా బ‌తికేదంటూ మ‌హిళా లోక్ ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు దిగింది. ఎక్క‌డిక‌క్క‌డ మ‌ద్యం షాపుల ఏర్పాటును అడ్డుకుంది.

ఈ ఆందోళ‌న‌ల‌కు మ‌హిళా - ప్ర‌జా సంఘాలు కూడా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణాలు - న‌గ‌రాల‌తో పాటు గ్రామాల‌కు కూడా స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారుల పేర్ల మార్పున‌కు సుప్రీంకోర్టు అంగీక‌రించ‌డంతో మ‌ద్యం వ్యాపారులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నాయి. అయితే మ‌ద్యం విక్ర‌యాల‌పై ఆది నుంచి వ్య‌తిరేకంగానే ఉన్న మ‌హిళా లోకం మాత్రం త‌మ ఆందోళ‌న‌ల‌ను విర‌మించ‌లేదు. ఈ నిర‌స‌న‌లు నిన్న టాలీవుడ్ టాప్ హీరో - హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు కూడా తాకాయి. బాల‌య్య సొంత నియోజ‌క‌వర్గం హిందూపురంలో ఓ మ‌ద్యం షాపును ఏర్పాటు చేసేందుకు ఓ వ్యాపారి ఏకంగా బాల‌య్య ఇంటికి దారి తీసే దారినే ఎంచుకున్నాడు. బాల‌య్య ఇంటి దారిలోనే కాకుండా... బాల‌య్య ఇంటికి కూత‌వేటు దూరంలో ఏర్పాట‌వుతున్న మ‌ద్యం షాపు విష‌యాన్ని తెలుసుకున్న హిందూపురం మ‌హిళ‌లు ఒక్క‌సారిగా ఆగ్ర‌హావేశాల‌కు గుర‌య్యారు.

త‌క్ష‌ణ‌మే ఆ మ‌ద్యం షాపును అక్క‌డి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌కు దిగారు. వంద‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన మ‌హిళ‌లు పెనుగొండ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కాగా... ప‌రుగు ప‌రుగున అక్క‌డికి వ‌చ్చిన పోలీసులు వారిని అక్క‌డి నుంచి బ‌లవంతంగా పంపించివేశారు. అయితే అప్ప‌టికి కూడా స‌దరు మ‌ద్యం షాపుల‌ను తొల‌గిస్తామ‌ని అధికారుల నుంచి స్ప‌ష్ట‌మైన హామీ రాని నేప‌థ్యంలో మ‌హిళ‌లు... ఈ ద‌ఫా ఏకంగా బాల‌య్య ఇంటి వ‌ద్దే నిర‌స‌న‌కు దిగారు. దీంతో కంగారుప‌డ్డ బాల‌య్య పీఏ - టీడీపీ నేత‌లు... మ‌హిళ‌లతో మాట్లాడి ఆ వైన్ షాపును మ‌రో ప్రాంతానికి త‌ర‌లిస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన మ‌హిళ‌లు ఆందోళ‌న విర‌మించారు.