Begin typing your search above and press return to search.

అనంత విశ్వంలో అద్భుతం.. ఈ ఫోటో చూస్తే కళ్లు తిప్పుకోలేరంతే

By:  Tupaki Desk   |   24 May 2022 11:30 PM GMT
అనంత విశ్వంలో అద్భుతం.. ఈ ఫోటో చూస్తే కళ్లు తిప్పుకోలేరంతే
X
అనంత విశ్వంలో మనం ఎంత? అన్న ప్రశ్న వేసుకుంటే.. దానికి సమాధానం వెతికితే.. మనం తర్వాత.. మన భారీగా భావించే సౌర కుటుంబం మొత్తమే ఒక చనక్కాయ గింజగా చెప్పాలి. అలాంటప్పుడు మన భూమి మాటేమిటి? అంటే.. అదో ఆవ గింజ మాత్రమే. అందులో ప్రపంచ దేశాలు.. మనషులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ అనంత విశ్వంలో మనమెంత అల్పులమన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. అలాంటి అనంత విశ్వంలో ఒక మహాద్భుతం ఒకటి చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన ఫోటోల్ని నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసింది. ఆ ఫోటోల గురించి చెప్పుకునే ముందు.. మళ్లీ మనం మన సౌర వ్యవస్థ గురించి చెప్పుకొస్తే.. పాలపుంత గెలాక్సీ మొత్తం ఒక పెసరదోశె అనుకుంటే.. దానికి 70 ఎంఎం దోశెగా చెప్పే మరో గెలాక్సీ ఉంది.

దాని పేరు ఆండ్రోమెడా గెలాక్సీ. ఈ ఆండ్రోమెడా గెలాక్సీ.. రానున్న వేలాది సంవత్సరాల తర్వాత మన గెలాక్సీని ఢీకొట్టటం ఖాయమంటున్నారు మన ఖగోళ శాస్త్రవేత్తలు. అప్పుడెలా ఉంటుందన్న విషయాన్ని మనం మాత్రమే కాదు.. మన సమీప భవిష్యత్తు తరాలు కూడా చూడలేవు.

కానీ.. అలాంటిదే ఒకటి ఈ అనంత విశ్వంలో జరగటం.. దానికి సంబంధించిన అద్భుతమైన ఫోటోను హబుల్ టెలిస్కోప్ ఫోటోగా బంధించింది. గతంలో రెండు గెలాక్సీలు బలంగా ఢీ కొన్న తర్వాత.. అవి రెండు ఒకటిగా మారే స్థితిలోకి వచ్చేశాయి. వీటిని యాంటెన్నా గెలాక్సీలుగా అభివర్ణించొచ్చు. దీనికి సంబంధించిన ఫోటోల్ని తాజాగా నాసా విడుదల చేసింది. ఈ ఫోటోల్ని చూసినంతనే కళ్లు తిప్పుకోలేనంత కొత్తగా ఉండటమే కాదు.. ఇలాంటి అద్భుతం మనం చూసే అవకాశాన్ని ఇచ్చిన నాసాకు థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండలేం.

రెండు గెలాక్సీలుగా ఉన్నవి కాస్తా ఢీ కొని ఒకటిగా మారుతున్న వేళ.. ఒకటే గెలాక్సీగా మారతాయి. దీనికి కోట్లాది సంవత్సరాలు పడతాయి. అంటే.. ప్రతి రోజూ అక్కడ తీవ్రమైన వేగంతో నక్షత్రాలు కదులుతూ ఉంటాయి. దీని వల్ల భారీగా గ్యాస్ అంతరిక్షంలోకి దూసుకెళుతుంటాయి. ఫోటోలో కనిపిస్తున్న పింక్.. రెడ్ కలర్ లో ఉన్నవి గ్యాస్ మేఘాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లూ కలర్ లో ఉన్నవి పుడుతున్న నక్షత్రాలు అయితే.. పసుపు రంగులో ఉన్నవి సగం ఆయుష్షు పూర్తి అయిన నక్షత్రాలు అయితే.. ఆరెంజ్ రంగంలో కనిపిస్తున్నవి అంతరించనున్న నక్షత్రాలుగా చెబుతున్నారు.

ఇప్పటికి వేస్తున్న అంచనాల ప్రకారం చూస్తే.. 450 కోట్ల ఏళ్ల తర్వాత ప్రళయం వస్తుందని.. అప్పుడు మన పాలపుంతకు చాలా పెద్దదైన ఆండ్రోమెడా గెలాక్సీ.. మన గెలాక్సీని ఢీకొన్న తర్వాత అన్ని అల్లకల్లోలం అవుతాయని.. అలా ఢీ కొట్టిన 150 కోట్ల ఏళ్ల తర్వాత కొత్త గెలాక్సీ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి 31 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఈ అద్భుత నక్షత్ర రాశి ఉందని గుర్తించారు. చూసినంతనే వావ్ అనిపించేలా ఉన్న ఈ ఫోటోను చూసి మీరు ఎంజాయ్ చేయండి.