Begin typing your search above and press return to search.

ఆర్టీసీ నంబర్ జడ్ కు - నిజాం రాజుకు లింకేటి?

By:  Tupaki Desk   |   28 Oct 2019 1:30 AM GMT
ఆర్టీసీ నంబర్ జడ్ కు - నిజాం రాజుకు లింకేటి?
X
తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులను ఎప్పుడైనా గమనించారా? ఆ బస్సులకు నంబర్ ప్లేట్ పై జడ్ మాత్రమే ఉంటుంది. మన వాహనాలకు మాత్రం ఏ టు వై వరకు రిజిస్ట్రేషన్ నంబర్లు ఉంటే ఆర్టీసీ బస్సుల నంబర్ ప్లేట్ లు మాత్రం జడ్ అక్షరంతోనే ఉంటాయి. ఏపీలో అయితే ఏపీ 10 జడ్ అని నంబర్ ఉంటుంది. తెలంగాణలో టీఎస్ 10 జడ్ అని నంబర్ ఉంటుంది. ఇలా జడ్ అక్షరం రావడం వెనుక ఏకంగా 87 ఏళ్ల చరిత్ర ఉంది.

అది నిజాం రాజులు పరిపాలిస్తున్న కాలం.. 1879లో హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న ఆరో నిజాం రాజు మహమూబ్ అలీఖాన్ కాలంలోనే ‘నిజాం గ్యారంటీడ్ రైల్వే సంస్థ’ పేరుతో రైల్వే వ్యవస్థను హైదరాబాద్ రాజ్యంలో ఏర్పాటు చేశారు. తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. దీని తర్వాత 1932లో ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ‘నిజాం స్టేట్ రైల్వేస్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్టు డివిజన్’ ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ప్రజారవాణా కోసం 22 బస్సులు, 166 మంది సిబ్బందితో ఆర్టీసీ సంస్థను ఏర్పాటు చేశారు. స్కాట్లాండ్ ఆటోమొబైల్ సంస్థ ఈ బస్సులను అందించింది. నిజాం కాలంలో బస్సులను గుర్తించేందుకు వీలుగా నంబర్ ప్లేట్ పై హైదరాబాద్ స్టేట్ తెలిసేలా హెచ్.వై తర్వాత జెడ్ అక్షరం వేశారు.

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ జడ్ అక్షరాన్ని జోడించడానికి ప్రధాన కారణం ఆయనకు ఉన్న తల్లి ప్రేమేనట.. తొలుత ఆర్టీసీకి తల్లి పేరు పెడుదామని అనుకున్నాడట.. కానీ ఇలా వ్యక్తుల పేరు ప్రభుత్వ సంస్థకు పెట్టడం మంచిది కాదని మంత్రులు సూచించారట.. దీంతో బస్సుల నంబర్ ప్లేట్లలో తన తల్లి జెహ్రా బేగం పేరు కలిసేలా జెడ్ ను పెట్టించాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం స్వాతంత్ర్యం వచ్చాక కూడా అలా ఆర్టీసీలో తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.