Begin typing your search above and press return to search.

విద్యుత్ షాక్ తో 11మంది కూలీల దుర్మరణం

By:  Tupaki Desk   |   14 May 2020 4:25 PM GMT
విద్యుత్ షాక్ తో 11మంది కూలీల దుర్మరణం
X
వలస కూలీల బతుకు మరోసారి తెల్లారిపోయింది. ఉపాధి కోసం పోయి అటు నుంచే అటే తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదంలో 11 మంది వలస కూలీలు విద్యుత్ షాక్ తో గిలగిలా కొట్టుకొని చనిపోయిన వైనం అందరినీ కలిచివేసింది.

ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగి ట్రాక్టర్ లో ఉన్న ఉన్న కూలీలపై పడింది. దీంతో అందరికీ విద్యుత్ షాక్ తగిలి 11 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ లో ఉన్న పలువురికి తీవ్రయాలయ్యాయి. గాయాలైన వారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిలో ఏడుగురు మహిళలు ఉండడం విషాదం నింపింది.

ఈ ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ లో డ్రైవర్ తో కలిపి 23మంది ఉన్నారు. మిర్చి కోతలకు ఈ వలస కూలీలు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా మాచవరం ఎస్సీ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.. డ్రైవర్ అతి వేగంతోపాటు.. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.

వలస కూలీల మరణంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.