Begin typing your search above and press return to search.

షాకింగ్ : క్వారంటైన్ చేస్తారని రైలు నుండి దూకిన వలస కూలీలు!

By:  Tupaki Desk   |   11 May 2020 1:00 PM GMT
షాకింగ్ : క్వారంటైన్ చేస్తారని రైలు నుండి దూకిన వలస కూలీలు!
X
క్వారంటైన్‌ తప్పించుకోవటానికి వలస కూలీలు చేయకూడని పెద్ద సాహసం చేశారు. ప్రయాణం చేస్తున్న రైలు నుండి అమాంతం దూకేశారు. అయితే, వారికీ ఈ భూమి పై నూకలు ఉండటంతో బతికి బైటపడ్డారు. కానీ ఏ క్వారంటైన్‌ కైతే భయపడ్డారో దాని నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ ఘటన ఒడిశాలోని ఆంగుల్ జిల్లా మఝికాలో చోటుచేసుకుంది.

ఈ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయిన లక్షలాదిమంది వలస కూలీలు తమ తమ స్వగ్రామాలకు వెళ్లిపోవాలని తపన పడుతున్నారు. వలస వచ్చిన ప్రాంతంలో పనులు లేక..తినటానికి తిండి లేక నానా కష్టాలు పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల ను ఏర్పాటు చేసింది. ఈ శ్రామిక్ రైళ్లలో వారి వారి స్వస్థలాలకు తరలించే చర్యలు చేపట్టింది. ఆ రైళ్లలో గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ నుంచి ఒడిశాకు చెందిన వలస కార్మికులు సొంతూళ్లకు బయల్దేరారు. మరి కొద్ది సమయానికి వారి ఇళ్లకు చేరుతామని వారు ఆనందపడిపోయారు.

కానీ, ఒడిశా చేరగానే తమను క్వారంటైన్‌ కు తరలిస్తారనే విషయం వారికి తెలిసింది. దీనితో భయపడిన వలస కూలీలు.. క్వారంటైన్‌ నుంచి ఎలాగైనా తప్పించు కోవాలనుకున్నారు. దీంతో 20 మంది ప్రయాణిస్తున్న రైలు నుంచి దూకేశారు. కానీ అదృష్టం బాగుండి ప్రాణాలతో బైటపడ్డారు. కాగా..పలు ప్రాంతాల నుంచి ఒడిశాకు వచ్చే వారు తప్పనిసరిగా 28 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి ప్రభుత్వం మూడు రోజుల క్రితం కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది.

ఇది తెలుసుకొన్న వలసకూలీలు 28 రోజుల క్వారంటైన్‌ నుంచి తప్పించుకుందామని ఆంగుల్‌ జిల్లాలోని ఓ వంతెన వద్దకు రైలు రాగానే రైలు నుంచి దూకేశారు. దీన్ని గమనించిన బెనగాడియా గ్రామ సర్పంచ్‌ బిరాబరా నాయక్‌ వారిలో నుంచి ఏడుగురిని పట్టుకొని అధికారులకు అప్పగించగా..జగత్‌ సింగ్‌ పూర్‌ లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కు తరలించారు. కాగా..ఇప్పటివరకు పలు ప్రాంతాల నుంచి ఒడిశాకు వచ్చిన 391 మంది వలస కూలీల్లో 300 మందికి పాజిటివ్‌గా తేలింది.