Begin typing your search above and press return to search.

క‌నిగిరి ఎమ్మెల్యే ఇంటిముందు కార్మికుల ధ‌ర్నా.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   20 Oct 2021 7:30 AM GMT
క‌నిగిరి ఎమ్మెల్యే ఇంటిముందు కార్మికుల ధ‌ర్నా.. రీజ‌నేంటి?
X
ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్‌యాద‌వ్ చిక్కుల్లో ప‌డ్డారు. త‌మ‌తో ప‌నులు చేయించుకుని డ‌బ్బులు ఇవ్వ‌కుండా ఎమ్మెల్యే ముఖం చాటేస్తున్నార‌ని పేర్కొంటూ.. ఆర్‌డ‌బ్ల్యుఎస్ చంద‌వ‌రం ప‌థ‌కం కింద తాగునీటి స‌ర‌ఫ‌రా విభాగంలో ప‌నిచేసే కార్మికులు ఏకంగా ఆయ‌న ఇంటి ముందు ధ‌ర్నా దిగ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చంద‌వ‌రం ప‌థ‌కంలో భాగంగా.. కొన‌క‌మిట్ల ప్రాంతంలో 50 మంది కార్మికులు ప‌నిచేశారు. ఆయా ప‌నుల‌ను ఎమ్మెల్యే బుర్రానే స్వ‌యంగా నిర్వ‌హించారు.

ఈ ప‌నులు దాదాపు ఆరు మాసాలు సాగాయి. వీటిలో మూడు నెలల 15 రోజులు అంటే.. దాదాపు వంద రోజుల‌కు పైగా కార్మికుల‌కు ఇవ్వాల్సిన వేత‌నాల‌ను ఆయ‌న ఇవ్వ‌కుండా వేధిస్తున్నార‌ని.. కార్మికులు చెబుతున్నారు. ఈ నిధుల‌ను ఎమ్మెల్యే త‌న సొంత నిధుల‌కు మ‌ళ్లించుకున్నార‌ని.. తాము ఎప్పుడు అడిగినా.. అదిగో.. ఇదిగో అంటూ.. తిప్పించుకుంటున్నార‌ని.. కార్మికులు విల‌విల్లాడుతున్నారు. అంతేకాదు.. పండుగ సీజ‌న్ కావ‌డం ఒక‌వైపు, పిల్ల‌ల స్కూల్ ఫీజులు క‌ట్టాల్సి రావ‌డం మ‌రోవైపు.. ఉండ‌డంతో త‌మ‌కు చేతిలో చిల్లిగ‌వ్వ‌లేక నానా తిప్పులు ప‌డుతున్నామ‌ని.. కార్మికులు వాపోతున్నారు.

ఆయా స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యేకు చెప్పినా.. ఆయ‌న ఏమాత్రం ఖాత‌రు చేయ‌డం లేద‌ని కార్మికులు ఆరోపించారు. ఈ క్ర‌మంలో త‌మ వేత‌నాలు త‌మ‌కు చెల్లించాలంటూ.. మంగ‌ళ‌వారం ఏకంగా ఎమ్మెల్యే ఇంటి ముంందు.. ధ‌ర్నాకు దిగారు. ఏదైనా అడిగితే.. త‌న కుమార్తె పెళ్లి ఉంద‌ని.. అది అయ్యాక మాట్లాడ‌దామ‌ని చెబుతున్న‌ట్టు కార్మికులు తెలిపారు. ఇప్ప‌టికైనా త‌మ వేత‌నాలు ఇప్పించాల‌ని.. వారు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, గ‌తంలో ఎమ్మెల్యేపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వృత్తి రీత్యా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అయిన‌.. మ‌ధు.. ఇసుక దోపిడీ చేశార‌ని.. కాంట్రాక్టులు తీసుకుని మ‌ధ్య‌లోనే వ‌దిలేసార‌ని.. ఆరోప‌ణ‌లు వినిపించాయి. తాజాగా కార్మికుల సొమ్మును కూడా ఆయ‌న వాడుకోవ‌డం జిల్లాలోచ‌ర్చ‌నీయాంశంగా మారింది.