Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు : ఢిల్లీలో కార్మికుల నిరసనల సెగ అడ్డుకుంటున్న ఢిల్లీ పోలీసులు

By:  Tupaki Desk   |   2 Aug 2021 9:25 AM GMT
విశాఖ ఉక్కు : ఢిల్లీలో కార్మికుల నిరసనల సెగ అడ్డుకుంటున్న ఢిల్లీ పోలీసులు
X
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా విశాఖ ఉక్కు కార్మిక పోరాటం సాగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు, రేపు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన కొనసాగించాలని నిర్ణయించిన విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు, వేలాది కార్మికులతో కలిసి ఢిల్లీ చేరుకుని ఆందోళన బాట పట్టాయి. జంతర్ మంతర్ వద్ద రెండు రోజులపాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపధ్యంలో తమ గళాన్ని చట్టసభ్యులకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఢిల్లీలో పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఏ

పీ నుండి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ఢిల్లీ పోలీసులు నిఘా పెట్టారు. న్యూ రైల్వే స్టేషన్ దగ్గర స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు రెండున్నర గంటల పాటు వారిని నిర్బంధించారు. అంతేకాదు ఆందోళన చేయడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఎవరు హోటల్ గదులు అద్దెకు ఇవ్వకూడదని స్థానిక హోటల్స్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రైతులకు మద్దతుగా ఢిల్లీకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వచ్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల తీరుపై విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని చెప్తున్నా సరే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం అన్యాయం అంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు జరిపి కేంద్రం సహకరిస్తే లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ పయనిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించనున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల ఆందోళనపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ చేరుకున్న వేలాది కార్మికుల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్రానికి నిరసనల సెగ తగులుతోంది. అడుగడుగునా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, కార్మికులకు ఆటంకాలు కలిగిస్తున్న పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాన్ని అణచివెయ్యటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా ఆందోళన చేసి తీరుతామని అంటున్నారు. అయితే , కేంద్రం మాత్రం విశాఖ ఉక్కు పై నిర్ణయం అయిపోయింది , ఇక మార్పు ఉండదు అని స్పష్టం చేస్తుంది.