Begin typing your search above and press return to search.

జీతాలు ఇవ్వట్లేదని ఆ ఫోన్ల తయారీ కంపెనీ దగ్గర కార్మికుల రచ్చ

By:  Tupaki Desk   |   13 Dec 2020 10:57 AM GMT
జీతాలు ఇవ్వట్లేదని ఆ ఫోన్ల తయారీ కంపెనీ దగ్గర కార్మికుల రచ్చ
X
కొన్ని కంపెనీలు అనురించే కక్కుర్తి వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారటమే కాదు.. ఈ విషయంలో ఏ మాత్రం సంబంధం లేని వారి ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతుంది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి వింటే నిజమనిపించక మానదు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న ఐ ఫోన్ తయారీ సంస్థకు.. అక్కడ పని చేసే కార్మికుల నిరసన సెగ భారీగా తగిలింది. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న సంస్థపై వారు దాడి చేసిన వైనం సంచలనంగా మారింది.

తైవాన్ ప్రధాన కేంద్రంగా ఉన్న విస్ట్రోన్ కార్పొరేషన్ కు అనుబంధ సంస్థ కర్ణాటకలో ఏర్పాటు చేశారు. అయితే.. స్థానిక యాజమాన్యం కార్మికులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. దీంతో.. వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపై అధికారులకు.. కార్మికుల మధ్య విభేదాలురావటం.. అది కాస్తా గొడవగా మారింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు.. సంస్థపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో సంస్థకు చెందిన వాహనాలు.. ఫర్నీచర్.. కంప్యూటర్లు.. ల్యాప్ టాప్ లు దెబ్బ తిన్నాయి. చాలాకాలంగా తమకు సరైన జీతాలు ఇవ్వటం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే.. కార్మికుల నిరసన కారణంగా తమకు చాలా నష్టం వాటిల్లినట్లుగా కంపెనీ ఆరోపిస్తోంది. కాంట్రాక్టు కార్మికుల కాలపరిమితిని తగ్గించాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమను పట్టించుకోవటం లేదని నిరసనకారులు తెలిపారు. మొత్తంగా ఈ ఉదంతం తీవ్ర సంచలనానికి తెర తీసింది.