Begin typing your search above and press return to search.

తండ్రి..కొడుకుల అత్యుత్సాహానికి ప్ర‌పంచ బ్యాంక్ బ్రేకులు!

By:  Tupaki Desk   |   22 July 2019 6:57 AM GMT
తండ్రి..కొడుకుల అత్యుత్సాహానికి ప్ర‌పంచ బ్యాంక్ బ్రేకులు!
X
ఇదిగో తోక అంటే.. అదిగో పులి అన్న చందంగా ఉంది టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆయ‌న‌కు పుత్ర‌ర‌త్నం లోకేశ్ బాబుల మాటలు. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ చేసే వీరిద్ద‌రూ.. జ‌గ‌న్ స‌ర్కారును డ్యామేజ్ చేసేందుకు చేసే ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. అర‌కొర స‌మాచారంతో అదే ప‌నిగా విష ప్ర‌చారం చేసే ఈ తండ్రికొడుకుల పైత్యం ఏ పాటిద‌న్నది తాజాగా ప్ర‌పంచ బ్యాంకు చెప్పిన మాట‌ను చూస్తే.. ఇట్టే అర్థం కాక మాన‌దు. ఇటీవ‌ల ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రుణం ఇచ్చే అంశంపై తాము వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్లుగా పేర్కొన్న‌ది తెలిసిందే.

ప్ర‌పంచ‌బ్యాంకు వెబ్ సైట్ లో పెట్టిన ఈ స‌మాచారాన్ని చూసినంత‌నే లోకేశ్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. జ‌గ‌న్ ఎంట్రీతో ఏపీకి జ‌ర‌గ‌కూడ‌ని అన్యాయం ఏదో జ‌రిగిపోయిన‌ట్లుగా వాపోయారు. అమ‌రావ‌తి నిర్మాణానికి రుణ సాయాన్ని నిరాక‌రించ‌టం వెనుక జ‌గ‌న్ పాల‌నా తీరే కార‌ణ‌మంటూ దుర్మార్గ‌పు ప్ర‌చారానికి తెర తీయ‌టం తెలిసిందే.

ఈ అంశంపై సోష‌ల్ మీడియాలో లోకేశ్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. తాజాగా అమ‌రావ‌తి నిర్మాణానికి రుణం ప్ర‌తిపాద‌న‌ను తాము ఉప‌సంహ‌రించుకోవ‌టానికి కార‌ణం ఏమిట‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది ప్ర‌పంచ బ్యాంకు.

భార‌త ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కే తాము రుణాన్ని ఉప‌సంహ‌రించుకున్న‌ట్లుగా వెల్ల‌డించింది. ఈ నెల 15న భార‌త ప్ర‌భుత్వం త‌మ‌కు లేఖ రాసింద‌ని.. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తి నిర్మాణానికి రుణ ప్ర‌తిపాద‌న‌ను తాము ర‌ద్దు చేసుకున్న వైనాన్ని వెల్ల‌డించింది. ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలిగినా.. ఏపీకి త‌మ స‌హ‌కారం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంద‌ని హామీ ఇచ్చింది.

ఏపీలో ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వం త‌మ అభివృద్ధి ప్రాధామ్యాల్ని డిసైడ్ చేసుకొని.. కేంద్ర‌ప్ర‌భుత్వం ద్వారా త‌మ‌ను సంప్ర‌దిస్తే.. అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. అమ‌రావ‌తి నిర్మాణం విష‌యంలో ప్ర‌పంచ బ్యాంకు వెన‌క్కి వెళ్ల‌టం వెనుక జ‌గ‌న్ ప్ర‌భుత్వం కంటే కేంద్ర ప్ర‌భుత్వం రాసిన లేఖే కార‌ణ‌మ‌న్న విష‌యం తాజాగా తేల్చింది. అత్యుత్సాహంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నింద‌లు వేసిన బాబు.. చిన‌బాబులు తాజాగా ప్ర‌పంచ బ్యాంక్ ప్ర‌క‌ట‌న‌తో లెంప‌లు వేసుకుంటారా?