Begin typing your search above and press return to search.

భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   1 April 2021 3:52 AM GMT
భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
X
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపచం బ్యాంకు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అసలే మందగమనం, ఆపై కరోనా పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. ఈ అనిశ్చితి నుంచి ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా కోలుకోవడం పట్ల ప్రపంచ బ్యాంకు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఇంకా పూర్తి స్థాయి వృద్ధిరేటు నమోదు కాలేదని... కొన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది.

కొవిడ్ మహమ్మారి విసిరిన పంజా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అయినా దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సర దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.5 నుంచి 12.5కి చేరుతుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వార్షిక సమావేశం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఆసియా ఎకనమిక్ ఫోకస్ నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపై ప్రపంచబ్యాంకు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

వాస్తవానికి కరోనా పరిస్థితులకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం గమనార్హం. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8.3గా ఉన్న జీడీపీ వృద్ధిరేటు క్రమంగా 2019-20లో 4.0 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. వ్యక్తిగత వృద్ధి క్షీణించడం, ఆర్థిక రంగంలో ఒడుదొడుకులు, పెట్టుబడులు, ఇతర ఇబ్బందుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందని పేర్కొంది. మార్కెట్లు కోలుకుంటున్నాయని, కరెంట్ అకౌంట్లు స్వల్పంగా లోటు స్థితికి చేరుకుంటున్నాయని తెలిపింది. ఇవి వచ్చే ఆర్థిక సంవత్సరాలకు 1శాతం వృద్ధి సాధిస్తాయని అంచనా వేసింది.

కొవిడ్ పరిస్థితుల అనంతరం అనూహ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించడం పట్ల ప్రపంచ బ్యాంకు సౌత్ ఆసియా రీజియన్ చీఫ్ ఎకనమిస్ట్ హాన్స్ టిమ్మర్ ఓ ఇంటర్వ్యూలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇది పూర్తి స్థాయిలో పుంజుకోలేదని.. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గతేదాది ఆర్థిక కార్యకలాపాలు మునుపెన్నడూ లేనివిధంగా దాదాపు 40శాతానికి క్షీణించి తీవ్ర మందగమనంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం క్రమంగా భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని తెలిపారు. అయితే రెండేళ్ల నుంచి వృద్ధి జరగడం లేదని.. తలసరి ఆదాయం తగ్గుతోందని అన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ తొలి స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం పెద్ద సవాలు అని అభిప్రాయపడ్డారు. కొవిడ్ మహ్మారి ప్రభావం లేకపోతే భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించేదని అన్నారు.