Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ బ్యాంక్ హెచ్చ‌రిక‌: ఆరు కోట్ల మంది పేద‌రికంలోకి..

By:  Tupaki Desk   |   21 May 2020 12:30 AM GMT
ప్ర‌పంచ బ్యాంక్ హెచ్చ‌రిక‌: ఆరు కోట్ల మంది పేద‌రికంలోకి..
X
మాయ‌దారి వైర‌స్ మాన‌వ జాతిని స‌ర్వ‌నాశ‌నం చేస్తోంది. క‌నిపించ‌ని శ‌త్రువు క‌కావిక‌లం చేస్తోంది. ఆ వైర‌స్ విజృంభించ‌డంతో ప్ర‌పంచ‌మంతా చిన్న‌బోయింది. మేథోసంప‌ద గ‌ల మాన‌వుడు గిలిగిల‌లాడుతున్నాడు. దీని దెబ్బ‌కు ప్ర‌పంచ దేశాల‌న్నీ కుదేల‌వుతున్నాయి. ఆ వైర‌స్ క‌ట్ట‌డి కోసం అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని రంగాలు బంద‌‌య్యాయి. ఆ దేశాల ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌తో పాటు అంత‌ర్జాతీయ విప‌ణి కూడా ఘోరంగా ప్ర‌భావిత‌మ‌వుతోంది. అయితే ఈ ప్ర‌భావంతో ఎంతోమంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌స్తోంది. పేద‌లు, వ‌ల‌స కార్మికులు, కూలీలు జీవ‌నోపాధి కోల్పోయారు. దీంతో పేద‌రికం మ‌రోసారి పంజా విప్పుతోంది. కోట్ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు పేద‌రికం బారిన ప‌డ‌బోతున్నార‌ని ప్ర‌పంచ బ్యాంక్ హెచ్చ‌రించింది. సుమారు ఆరు కోట్ల మంది క‌టిక పేదరికంలోకి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌క‌టించిది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 5 శాతం ప‌డిపోనున్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంక్ అధ్య‌క్షుడు డేవిడ్ మ‌ల్‌పాస్ తెలిపారు. ఆ వైర‌స్ ప్ర‌భావంతో ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, వ్యాపారాలు కూడా దెబ్బ‌తింటున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పేద దేశాల‌కు వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంద‌ని చెప్పారు. ల‌క్ష‌లాది మంది జీవ‌నోపాధి నాశ‌న‌మైంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరోగ్య‌వ్య‌వ‌స్థ కూడా తీవ్ర కుదుపుకు గురైన‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా పేద‌రికం ఏ విధంగా గుర్తిస్తారో తెలిపారు.

రోజు క‌నీసం రెండు డాల‌ర్లు కూడా సంపాదించ‌లేని వారిని ప్ర‌పంచ బ్యాంక్ క‌టిక పేదలుగా గుర్తిస్తుందని తెలిపారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు త‌మ బ్యాంక్ పేద దేశాల‌కు సుమారు 160 బిలియ‌న్ డాల‌ర్ల‌ను రుణంగా ఇవ్వ‌నున్న‌దని ప్ర‌క‌టించారు. దాదాపు వంద దేశాల‌కు ఇప్ప‌టికే ఎమ‌ర్జెన్సీ ఫైనాన్స్ అందించిన‌ట్లు గుర్తుచేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ బ్యాంక్ కొన్ని దేశాల‌కు రుణం ఇస్తోందని తెలిపారు.