Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ‌బ్యాంక్ హెచ్చ‌రిక‌: గ‌తంలో ఎన్న‌డూ లేని సంక్షోభం రాబోతోంది..

By:  Tupaki Desk   |   9 Jun 2020 5:38 PM GMT
ప్ర‌పంచ‌బ్యాంక్ హెచ్చ‌రిక‌: గ‌తంలో ఎన్న‌డూ లేని సంక్షోభం రాబోతోంది..
X
మహమ్మారి వైర‌స్ ప్ర‌బ‌లి మాన‌వ ప్ర‌పంచం గ‌జ‌గ‌జ వ‌ణికిపోతోంది. ఈ సంద‌ర్భంగా అన్ని కార్య‌క‌లాపాలు స్తంభించిపోయాయి. అన్ని రంగాలు మూసుకుపోయాయి. ఈ స‌మ‌యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. ప్ర‌తి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్ర సంక్షోభంలో ప‌డింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంది. ఆ వైర‌స్ ప్ర‌భావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప‌డింది. అయితే ఆ వైర‌స్ ప్ర‌భావంతో భ‌విష్య‌త్‌లో మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ప్ర‌పంచ బ్యాంక్ హెచ్చ‌రించింది. మరింత ఘోరంగా ప‌రిస్థితి ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్, ఆర్థిక కార్యకలాపాల ప్రతిష్టంభన కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్య పరిస్థితి ఏర్పడనుందని తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 5.2 శాతం తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ సోమవారం ప్ర‌క‌టించింది.

ఈ వైర‌స్ అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగా ఉంటాయని తెలిపింది. తలసరి ఆదాయం ఈ ఏడాది 3.6 శాతం మేర తగ్గవచ్చునని, ఇది లక్షలాదిమంది పేదలను పేదరికంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఆర్థిక ప్రభావంతో పాటు అంతకుమించిన తీవ్రమైన, దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలుంటాయని త‌న నివేదిక‌లో వెల్ల‌డించారు. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక పేరు మీదుగా సోమ‌వారం (జూన్ 8) ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన కారణంగా నెలకొన్న సంక్షోభం, ఆర్థికమాంద్యం ఏర్పడిందని వివ‌రించారు. 1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేన (2020)ని డేవిడ్ మల్‌పాస్ తెలిపారు. వైర‌స్ అత్యంత తీవ్రంగా ఉన్న దేశాల్లో, ప్రపంచ వాణిజ్యం, పర్యాటక రంగం, వస్తువుల ఎగుమతులు , విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడే దేశాలలో ఈ ప్ర‌భావం తీవ్రంగా ఉంటుందని వివ‌రించారు. దీని ప్ర‌భావంతో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా ఉండవచ్చని అంచ‌నా వేశారు. ఇంత‌టి ప్ర‌భావం ఉండ‌డం 60 ఏళ్లలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ నిల‌దొక్కుకుంటుంద‌ని తెలిపారు. ఈ మాంద్యంలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వాటా 90 శాతానికి పైగా ఉంటుందని, ఇది 1930-32 మహా మాంద్యం సమయం నాటి 85 శాతం కంటే ఎక్కువని పేర్కొన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దారుణ పరిస్థితులు ఇప్పుడు కనిపించవచ్చునని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా 1870 నుంచి 14 ఆర్థిక మాంద్యాలను ప్రపంచం ఎదుర్కొందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. వాటి సంవత్స‌రాల‌ను కూడా విడుద‌ల చేసింది. ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక ప్ర‌కారం.. 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917 -1921, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020లలో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చిందని వివ‌రించింది.