Begin typing your search above and press return to search.

కష్టాల ఏపీ టాప్ లో ఎలా నిలిచింది..

By:  Tupaki Desk   |   15 Sep 2015 6:35 AM GMT
కష్టాల ఏపీ టాప్ లో ఎలా నిలిచింది..
X
29 రాష్ట్రాలు... 7 కేంద్రపాలిత ప్రాంతాలు... 98 పరిశీలనాశాలు.. భారీ పోటీ... అయినా కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. అవును పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల జాబితాను ప్రపంచబ్యాంకు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ అందులో దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాలనూ వెనక్కు నెట్టేసింది... పొరుగు రాష్ట్రం తెలంగాణ ఏపీ కంటే 11 స్థానాలు వెనుకబడింది.. అయితే... రాజధాని కూడా లేకుండా ఏర్పడి... లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి ఇంతటి స్థాయి ఎలా వచ్చింది...? అందుకు అనుసరించిన విధానాలేమిటి..? ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రాలను వెనక్కునెట్టి ఏపీ ఎలా ఈ రేసులో ముందు నిలిచిందన్నది ఆసక్తికరమే. తరచి చూస్తే అందుకు ఎన్నో కారణాలు... అన్నీ కలిసి ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాయి.

వ్యాపార సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్‌ జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. గుజరాత్‌ అగ్రగామిగా నిలవగా.. మూడు - నాలుగు - ఐదు స్థానాల్లో జార్ఖండ్ - చత్తీస్‌ గఢ్‌ - మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. చివరి స్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఉంది. వ్యాపార సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 70.12 శాతంతో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. గుజరాత్‌ 71.14 శాతం తో మొదటి స్థానాన్ని సాధించింది. గుజరాత్ కు - ఆంధ్రప్రదేశ్ కు మధ్య ఈ వ్యత్యాసం కేవలం ఒక శాతమే. కాబట్టి రెండో ర్యాంకులో ఉన్నప్పటికీ దేశంలో ఈ విషయంలో అగ్రగామిగా ఉందని చెప్పడానికి సందేహించనవసరం లేదు.

ప్రపంచ బ్యాంకు జాతీయస్థాయిలో వ్యాపార సంస్కరణలకు సంబంధించి అధ్యయనం నిర్వహించింది. ఇందుకు 98 అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. ఈ 98 అంశాలపై సర్వే నిర్వహించిన ప్రపంచబ్యాంకు అందులో ఎనిమిది అంశాలను ప్రధానంగా పరిగణించింది.

అవి

1. భూముల కేటాయింపు

2. నిర్మాణ అనుమతులు

3. కార్మిక సంస్కరణలు

4. నియంత్రణ

5. మౌలిక వసతుల కల్పన

6. పన్నుల విధానం

7. కంపెనీల రిజిస్ట్రేషన్

8. తనిఖీ నిబంధనలు

ఈ ఎనిమిది అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగులు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఈ ఎనిమిది అంశాల్లోనూ నిర్దిష్టమైన నిబంధనలతో, సులభ విధానాలతో ముందుకెళ్తోంది. పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూములను తగు విస్తీర్ణంలో కేటాయిస్తోంది.. అనుమతులు ఇవ్వడంలోనూ సింగిల్ డెస్క్ విదానం పాటిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ముందుంది. పన్నుల్లో రాయితీలు, మినహాయింపులు వంటివన్నీ పెట్టుబడిదారులు ఏపీపై దృష్టి పెట్టడానికి కారణమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ (డీఐపీపీ) ప్రతిఏటా ఆయా రాష్ట్రాల్లో వ్యాపార సంస్కరణలకు సంబంధించి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను అధ్యయనం చేసి ర్యాంకులు కేటాయిస్తుంది.

పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు వ్యాపార, వాణిజ్య సంబంధాల మెరుగుపరి చేందుకు ఆయా రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలు, కృషిని దృష్టిలో ఉంచుకుని ర్యాంకులను కేటాయిస్తారు. ఈ లెక్కన ఏపీ పారిశ్రామిక విధానం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనది. అంతేకాదు... పెట్టుబడులను పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక కృషి చేస్తోంది. పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉన్న దేశాలు... పారిశ్రామిక వర్గాలను కలిసి తమ వద్ద ఉన్న అవకాశాలు.. పారదర్శకత.. అనుమతుల్లో సౌలభ్యం.. వంటి అనేక అంశాలను స్పష్టంగా వివరిస్తూ వారిలో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు సాధించగలుగుతున్నారు. వీటన్నిటినీ ప్రపంచబ్యాంకు అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు.